కల్లు గీస్తూ గీత కార్మికుని మృతి

తంగళ్లపల్లి, వెలుగు: కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు మోకు జారడంతో చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ల కృష్ణయ్య(59) 35 ఏండ్లుగా గల్ఫ్ వెళ్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఏడాదిగా ఊర్లోనే ఉంటూ కల్లు గీస్తున్నాడు. రోజూలాగే బుధవారం ఉదయం కల్లుకు వెళ్లిన కృష్ణయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి తాటి వనంలో వెతికారు. తాటి చెట్టుపై చనిపోయి కిందికి వేలాడుతూ కనిపించాడు. మోకు జారి చాతికి బిగుసుకోవడంతో మృతి చెందాడని గ్రామస్తులు చెప్పారు. మృతునికి భార్య పద్మ, నలుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. జిల్లెళ్ల ఎంపీటీసీ, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకట్రావు మృతుని కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు.