లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మహిళల భద్రత కోసం ఆ రాష్ట్ర మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. టైలర్ షాపుల్లో మహిళల దుస్తుల కొలతలను పురుషులు తీసుకోకూడదని పేర్కొంది. సెలూన్స్ లోనూ అమ్మాయిల జుట్టు కట్ చేసే పనులు కూడా పురుషులు చేయకూడదని ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనలు మహిళల పట్ల పురుషుల దురద్దేశాలను అరికట్టడంతో పాటు బ్యాడ్ టచ్ నుంచి వారిని ప్రొటెక్ట్ చేస్తాయని మహిళా కమిషన్ అభిప్రాయపడింది.
ఈ మేరకు అక్టోబర్ 28న జరిగిన మహిళా కమిషన్ సమావేశంలోని నిర్ణయాలను కమిషన్ చైర్‌పర్సన్ బబితా చౌహాన్ శుక్రవారం మీడియాకు తెలియజేశారు. జిమ్‌లు, బోటిక్‌లలోని మెన్ ట్రైనర్ల వల్ల బ్యాడ్ టచ్ ఫిర్యాదులు పెరుగుతున్నాయని తెలిపారు. పురుషుడు టైలర్ గా పనిచేయటం తమ సమస్యకాదని..కానీ టైలర్ షాపుల్లో అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నామన్నారు.
ఈ ప్రదేశాలన్నింటిలో శిక్షణ పొందిన మహిళలను నియమించాల్సి ఉంటుందని చెప్పిన ఆమె.. దీనికి కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. తమ ప్రతిపాదనలు అమలు అయితే, మహిళలకు భద్రత లభించడంతోపాటు వారికి ఉపాధి కూడా దొరుకుతుందని బబితా చౌహాన్ పేర్కొన్నారు. ఈ ప్రపోజల్స్‌ను ఇప్పటికే ఉమెన్ ప్యానెల్ ఆమోదించిందని.. త్వరలో ప్రభుత్వానికి పంపుతామని తెలియజేశారు.
మిశ్రమ స్పందన
ఈ ప్రతిపాదనలపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు ఏ స్టోర్ లేదా ఏ జిమ్‌కు వెళ్లాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికే వదిలేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాగిణి సోంకర్ అన్నారు. సోషల్ వర్కర్స్ వీణా శర్మ, మొహసినా చౌదరి ఈ ప్రతిపాదనలను స్వాగతించారు.