అహ్మదాబాద్: వచ్చే ఏడాది జరగనున్న మెన్స్ అండర్–19 వరల్డ్ కప్ టోర్నీని శ్రీలంక నుంచి సౌతాఫ్రికాకు తరలించారు. లంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)పై సస్పెన్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఐసీసీ బోర్డు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌వ్యవహారాల్లో లంక స్పోర్ట్స్ మినిస్ట్రీ జోక్యం ఎక్కువ కావడంతో 11 రోజుల కిందట ఆ దేశ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వ్యవహారంపై ఇటీవలే లంక బోర్డుతో ఐసీసీ చర్చలు జరిపినా పెద్దగా ఫలించలేదు. ‘అండర్–19 వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికాకు తరలించాం. ఈ నిర్ణయానికి ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో దీనిపై చర్చించాం. తరలింపు నిర్ణయానికి అన్ని దేశాలు మద్దతు తెలిపాయి’ అని ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు పేర్కొన్నారు.
మరోవైపు ఐసీసీ సస్పెన్షన్‌ను పరిష్కరించుకోవడంపై లంక మరోసారి చర్చలు జరుపుతుందని ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా వెల్లడించారు. లంకలో క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు.