మెంగ్లా.. ఎబోలా కన్నా డేంజర్‌.. గబ్బిలాలతో వ్యాప్తి

మెంగ్లా.. ఎబోలా కన్నా డేంజర్‌.. గబ్బిలాలతో వ్యాప్తి

ఎబోలా.. ఈ పేరు వినగానే ప్రపంచం వణికిపోతుంది. ఆఫ్రికాలో వేలాది మందిని కబలించిన ఈ వైరస్‌ కన్నా ప్రమాదకరమైన మరో వైరస్‌ ను చైనాలో గుర్తించారు. అక్కడి యునాన్‌ ప్రావిన్స్‌‌లోని మెంగ్లా కౌంటీలో ఉండే ఓ రకం గబ్బిలాల్లో ఈ వైరస్‌ ను కనుగొన్నారు. ఆ కౌంటీ పేరుమీదుగానే దానికి ‘మెంగ్లా వైరస్‌ ’గా పేరు పెట్టారు. పాలిచ్చి పెంచే జీవుల్లో మనుషుల తర్వాత అత్యంత ఎక్కువ ఉప జాతులుగా ఉన్నవి గబ్బిలాలే. వాటితోపాటు కోతులు, కుక్కలు, ఎలుకల్లో చాలా వరకు జన్యువుల్లో పోలికలు ఉంటాయి. అందువల్ల ఈ జంతువుల్లో ఉండే వైరస్‌ లు, బ్యాక్టీరియాల వంటివి మనుషులకూ సంక్రమించే అవకాశాలు  చాలా ఎక్కువ. ఇప్పుడు గుర్తించిన మెంగ్లా వైరస్‌ కు ఎబోలా వైరస్‌ కు చాలా వరకు పోలికలు ఉన్నట్టు తేల్చారు.

ఇదీ ‘ఫిలో వైరస్‌ ’రకమే..

మనుషులు, జంతువులకు సంక్రమించే వైరస్‌ లలో అత్యంత ప్రమాదకరమైన రకం ‘ఫిలో వైరస్‌ ’. ఈ తరహా వైరస్‌ లు ‘ఎన్‌ పీసీ1’అనే రిసెప్టార్‌ సహాయంతో జీవ కణజాలంపై దాడి చేస్తాయి. తీవ్రస్థాయి రోగాలకు కారణమవుతాయి. అయితే వీటిల్లోనూ సగానికిపైగా జన్యువులు ఒక్కో వైరస్‌ కు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ఒకదానిని నియంత్రించే ఔషధం మరోదానిపై పనిచేసే అవకాశాలు తక్కువ. ప్రమాదకరమైన ఎబోలా, మార్‌ బర్గ్, క్ యూవా వైరస్‌ లతోపాటు తాజాగా గుర్తించిన మెంగ్లా వైరస్‌ కూడా ‘ఫిలో వైరస్‌ ’రకానికి చెందినదిగా గుర్తించారు.

ఇప్పటికే సోకిందా ?

మనుషులు నివసించే ప్రదేశాలకు సమీపంలో ఎక్కువగా ఉండే ‘ఫ్రీ టెయిల్డ్‌ , ఫ్రూట్‌ బ్యాట్స్‌‌’వంటి రకాలకు చెందిన గబ్బిలాల్లో ఫిలో వైరస్‌ లను కనుగొన్నారు. ఆఫ్రికాలో గబ్బిలాల మాంసాన్ని ఆహారంగా కూడా ఉపయోగిస్తారు . దాంతో ‘ఫ్రీటెయిల్డ్‌ ’రకం గబ్బిలం నుంచే ఎబోలా వైరస్‌ మనుషులకు సోకినట్టు గతంలోనే గుర్తించారు. ఇప్పుడు చైనాలో ఫ్రూట్‌ బ్యాట్‌ రకం గబ్బిలంలోనే మెండ్లా వైరస్‌ ను గుర్తించారు. ఇది ఇంకా మనుషులకు సోకిందా లేదా అన్నది తేల్చాల్సి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే కోతులు, ఎలుకల వంటివాటికి ఈ వైరస్‌ సంక్రమించి ఉంటే.. తర్వాత మనుషులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.