ICC ODI rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-10లో మనోళ్లే నలుగురు

ICC ODI rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-10లో మనోళ్లే నలుగురు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. బుధవారం (మార్చి 12) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు సంపాదించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాల్లో ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. యువ ఓపెనర్ శుభమాన్ గిల్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ రెండో స్థానంలోనే ఉన్నాడు.

ఇతర భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ 5, శ్రేయాస్ అయ్యర్ 8వ స్థానంలో నిలిచారు. కేఎల్ రాహుల్ 16 స్థానంతో సరిపెట్టుకున్నాడు.  న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకోగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన  రచిన్ రవీంద్ర 14 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ కూడా ఆరు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. 

Also Read:- పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది..

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడో  స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ జడేజా 10 వ స్థానంలో ఉన్నాడు.   శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 9 వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ ఆరు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో ర్యాంక్ లో ఉన్న రషీద్ ఖాన్ ఏకంగా ఏడో స్థానానికి పడిపోయాడు.

కేశవ్ మహారాజ్ నాలుగో స్థానంలో.. కివీస్ పేసర్ మాట్ హెన్రీ ఆరో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది చెత్త బౌలింగ్ తో ఐదు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఆల్ రౌండర్లలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజమాతుల్లా ఓమర్జాయ్ అగ్ర స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో జడేజా ఒక్కడే టాప్ 10 లో పదో స్థానంలో నిలిచాడు.