
ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2007 వరకు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వైద్యరంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు తెరలేపింది. నిరుపేద ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఆరోగ్య భద్రత కల్పిస్తుండడం గొప్ప పరిణామం. ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటివరకు ఈ పథకం లక్షలాది మంది పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపింది.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కవరేజీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచింది. ఇటీవల అంచనాల ప్రకారం 2.84 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,402 ఆసుపత్రుల ద్వారా, వివిధ వ్యాధులు, ఆరోగ్య పరిస్థితుల కోసం 1,672 వైద్యచికిత్సలను ఉచితంగా ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తెచ్చింది. ఉచిత ఆరోగ్య బీమా కింద చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ పలురకాల ప్యాకేజీలను అందిస్తోంది. .
మానసిక ఆరోగ్య సేవలు అవసరం
1,672కి పైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ చికిత్స అందిస్తున్నది. అయితే, శారీరక జబ్బులకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. కానీ, ఏ రకమైన మానసిక జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకంలో తెలంగాణలో చోటు కల్పించకపోవడం చాలా బాధాకరం.
ప్రపంచవ్యాప్తంగా మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ దేశం ఒకటిగా ఉంది. దాదాపు 150 మిలియన్ల మందికి మానసిక ఆరోగ్య సేవలు అవసరం. 50% మానసిక ఆరోగ్య పరిస్థితులు 14 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతాయి. 75% మానసిక ఆరోగ్య పరిస్థితులు 24 సంవత్సరాల వయస్సులో అభివృద్ధి చెందుతాయి. మానసిక సంక్షోభం కేవలం వ్యక్తులను మాత్రమే ప్రభావితం చేయడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగిస్తోంది. సుమారు 45 మిలియన్ల మంది భారతీయులు డిప్రెషన్, 38 మిలియన్ల మంది ఆందోళనకర వ్యాధులతో, సుమారు 1% జనాభా స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్నారు. భారతదేశంలో ప్రతి లక్ష మందికి కేవలం 0.75 మంది మానసిక వైద్యులు మాత్రమే ఉన్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన లక్ష్యానికి చాలా తక్కువ.
ఇకనైనా కనికరించండి
భారతదేశంలో సుమారు 14% మంది ప్రజలు ఏదో ఒక రకమైన మానసిక, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2020 తెలియజేస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి మెరుగైన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో మానసిక ఆరోగ్యాన్ని చేర్చలేదు. ఆరోగ్య శ్రీ కింద మానసిక ఆరోగ్యం లేకపోవడానికి ప్రధాన కారణం... మానసిక ఆరోగ్య సంరక్షణ అనేది రోగిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేని వైద్య సమస్య లేదా జబ్బుగా పరిగణించినట్టు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి.
మన దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలను శారీరక ఆరోగ్యంలాగ పరిగణించకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య. ఒకేసారి అనేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని, ఇన్‌పేషెంట్ చికిత్స అవసరం ఉండదని అనుకుంటున్నారు. వాస్తవానికి స్కిజోఫ్రెనియా లేదా బై-పోలార్ డిజార్డర్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇతరత్రా వ్యసనాల కారణంగా ఎదురయ్యే మానసిక సమస్యలు, తీవ్రమైన డిప్రెషన్ సమస్యల పరిష్కారానికి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. ఇతర శారీరక సమస్యలు లేదా జబ్బులలాగ మానసిక సమస్యలు కూడా తీవ్రంగా మారిపోతున్నాయి. వాస్తవంగా మెజారిటీ ప్రజలు గ్రామీణ ప్రాంత, ఏజెన్సీ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్యానికి సరియైన వైద్యం అందక వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కావున, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మానసిక రోగాలను ఆరోగ్యశ్రీ పథకం జాబితాలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చేర్చాల్సిందిగా కోరుతున్నాం.
-డా. కేశవులు బాషవత్తిని,
సీనియర్
మానసిక వైద్య నిపుణుడు