మతిస్థిమితం లేని మహిళ కిడ్నాప్..  అత్యాచారం చేసి వదిలివెళ్లినట్లు అనుమానాలు

మతిస్థిమితం లేని మహిళ కిడ్నాప్..  అత్యాచారం చేసి వదిలివెళ్లినట్లు అనుమానాలు
  •  పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు 

మియాపూర్, వెలుగు: మియాపూర్​లో బస్టాప్ వద్ద నిల్చున్న మతి స్థిమితం లేని మహిళను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి వదిలి వెళ్లినట్లు తెలుస్తున్నది. గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో మియాపూర్ బొల్లారం క్రాస్ రోడ్డులో బస్టాప్ దగ్గర ఓ మహిళ(38) నిలబడి ఉంది. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీ పై వచ్చి ఆమెను బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు.

అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్ చూసి అనుమానంతో డయల్100కు సమాచారం ఇచ్చాడు. దీంతో మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళ బొల్లారంలో రోడ్డుపై తిరుగుతూ ఉండడం గమనించి పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు. ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఎటువంటి వివరాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు.

దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి వదిలేసి వెళ్లారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.