8 నెలల గర్భంతో మతిస్థిమితం లేని యువతి

హుజూర్ నగర్, వెలుగు : 8 నెలల గర్భంతో ప్లాట్​ఫాంపై కదలలేని స్థితిలో ఉన్న యువతిని పోలీసులు సఖి సెంటర్​కు తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  – మిర్యాలగూడ రోడ్డులో రైస్ మిల్లుల వద్ద మతిస్థిమితం లేని ఓ యువతి(20) కొన్ని రోజులుగా ప్లాట్​ఫాంపై ఉంటోంది. అనారోగ్యానికి గురైన ఆమె కదలలేని స్థితిలో ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువతికి ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా 8 నెలల గర్భవతి  అని తేలింది. యువతి వివరాలు అడగగా ఏం చెప్పలేకపోతోంది. ఆమెను జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.