‘క్లాస్​రూంలో స్టూడెంట్ ఉండగానే తాళం’ ఘటనపై విచారణ

‘క్లాస్​రూంలో స్టూడెంట్ ఉండగానే తాళం’ ఘటనపై విచారణ

లింగాల, వెలుగు : మండల పరిధిలోని శాయిన్ పేట యూపీఎస్ లో బుధవారం స్టూడెంట్స్​తరగతి గదిలో ఉండగానే తాళం వేసిన ఘటనపై గురువారం ఎంఈవో బషీర్ అహ్మద్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం స్కూల్​విడిచిన తర్వాత 1వ తరగతి స్టూడెంట్​శరత్ ఇంటికి రాకపోవడంతో అతడి తండ్రి మల్లేశ్ స్కూల్​వద్దకు వచ్చి కిటికీలో నుంచి చూడగా బాలుడు నేలపై నిద్రపోతున్నట్లు గుర్తించాడు. 

వెంటనే గది తాళం పగలగొట్టి  శరత్ ను ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇది వాస్తవంగానే జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీచర్లకు సూచించారు. సమాజానికి మార్గదర్శకులుగా నిలిచే  టీచర్లు సమయపాలన పాటిస్తూ తమ విధి నిర్వహణ పట్ల బాధ్యతయుతంగా మెలగాలన్నారు.