వరంగల్‌ మెప్మాలో 70 కోట్ల స్కాం

వారు పేద మహిళలు.. స్వశక్తి గ్రూపుల్లో చేరుస్తం, డబ్బులు వస్తయని చెప్తే.. ఫొటోలు, ఆధార్, ఓటరు కార్డుల జిరాక్సులు ఇచ్చిండ్రు. మెప్మా అధికారులు, బ్యాంకు సిబ్బంది కుమ్మక్కై ఆ పేద మహిళల పేరిట లోన్లు తీసుకున్నరు. ఇందుకోసం ఆ మహిళల వివరాలతోనే ఐదారు వందల నకిలీ గ్రూపులు పెట్టిండ్రు. రూ.70 కోట్ల దాకా కొల్లగొట్టిండ్రు. ఇట్ల మూడు నాలుగేండ్లు గడిచినయి. బ్యాంకుల పైఆఫీసర్లు ఈ లోన్ల పైసలు తిరిగొస్తలెవ్వేంది అనుకుంట థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లను పంపుతున్నరు. వీళ్లేమో ఆ పేద మహిళల ఇండ్ల మీద పడి పైసలు కడ్తరా, లేదా అని లొల్లి జేస్తుండ్రు. వరంగల్ జిల్లాలో ‘అవినీతి’బాగోతం ఇది. వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో రోజుకో చోట అవినీతి బాగోతం వెలుగులోకి వస్తోంది.

పేద మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మెప్మా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడ్డారు. నకిలీ మహిళా స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కాజేశారు. మహిళాగ్రూపులకు లోన్లు అందిం చేందుకు మెప్మా తరఫున వరంగల్ పట్టణంలో 12 మంది సీవోలు (కమ్యూనిటీ ఆర్గనైజర్లు) కీలకంగా వ్యవహరిస్తారు. ఒక్కో సీవో పరిధిలో సుమారు 1,000 గ్రూపులు ఉంటాయి. మహిళా గ్రూపులకు లోన్‍ రావాలంటే వారి సంతకం తప్పనిసరి. దీంతో కొందరు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుని పర్సంటేజీలు తీసుకోవడం చాలా ఏళ్లుగా సాగుతోంది. అయితే నలుగురు సీవో స్థాయి అధికారులు ఒక్కటై పెద్ద మొత్తంలో సొమ్ము దండుకునేందుకు ప్లాన్‌‌ వేశారు. చదువుకోని, అమాయక మహిళల ఫొటోలు, ఆధార్ కార్డుల సాయంతో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి, అవినీతికి పాల్పడ్డారు.

ఓ సీవోతో మొదలై..
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) వరంగల్ పరిధిలో 15,009 మహిళా గ్రూపులున్నాయి. ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 1,50,090 సభ్యులున్నారు. వీరిని సమన్వయం చేయడానికి 526 మంది రిసోర్స్​ పర్సన్లు (ఆర్పీలు), 12మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవోలు) ఉన్నారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఓసీవో అవినీతి వ్యవహారాన్ని మొదలుపెట్టాడని, ముగ్గురు మహిళా సీవోలతో కలసి మోసానికి తెరతీశాడని సమాచారం. వారికి కిందిస్థాయిలో ఉండే ఆర్పీలు, కొందరు గ్రూపు లీడర్లు, బ్యాంకు అధికారులు సహకరించారు. లోన్లు తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టారు. బ్యాంకుల్లో అవి బకాయిలుగా పేరుకుపోయాయి. వరంగల్ మెప్మా పరిధిలో గ్రూపులకు లోన్లు ఇవ్వడానికి 54 బ్యాంకు శాఖలు ఉండగా.. అలంకార్ జంక్షన్ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలోనే ఇలా రూ.10.5 కోట్ల బకాయిలున్నాయి. 2015, 2016లలో లోన్ తీసుకుని, ఇప్పటికీ కట్టని గ్రూపుల సంఖ్య దాదాపు 240. వీటిలో చాలా వరకు నకిలీవే.

రికవరీ కోసం ఇళ్ల మీదికి..
నకిలీ గ్రూపుల పేరిట తీసుకున్న లోన్లు మొండి బకాయిలుగా మారిపోవడంతో .. బ్యాంకుల ఉన్నతాధికారులు రికవరీ కోసం స్పెషల్ ఆఫీసర్లను, ఏజెంట్లను పంపారు. వారు లోన్ సమయంలో పెట్టిన అడ్రస్‌‌, ఐడీ ప్రూఫ్‌ లు పట్టుకుని నేరుగా మహిళల ఇండ్లకు వెళుతున్నారు. ‘మీ పేరుతో లోన్ ఉంది. వెంటనే కట్టకపోతే నోటీసులు పంపిస్తాం. పోలీసులు కేసులు పెడతాం. ఆస్తులు జప్తు చేస్తాం ’అంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో మహిళలులబోదిబోమంటున్నారు.

ఎంక్వైరీ ఏమైంది?
ఈ అవినీతి బాగోతం ఏడాదిన్నర కిందే బయటపడింది. కొందరు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి.. ముగ్గురు సీవోలు. నలుగురు ఆర్పీలను తొలగించారు. ఎంక్వైరీ జరిపిస్తామన్నారు. కానీ అది ముందుకు సాగలేదు. ఇదే సమయంలో రోజూకో నకిలీ గ్రూపు బాగోతం బయటపడుతోంది. ఈ వ్యవహారంలో సూత్రధారి అయిన వ్యక్తికి మాత్రం కొంతకాలం కింద ప్రమోషన్ వచ్చినట్టు తెలిసింది. అతను సీవోగా పనిచేసిన ప్రాంతం పరిధిలో చాలా బ్యాంకుల్లో భారీగా బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.