- డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తామంటున్న మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ
- డిమాండ్ బాగుందని వెల్లడి
- ఈ ఏడాది 51 వేల లగ్జరీ కార్లు అమ్ముడయ్యే అవకాశం
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు పండుగ సీజన్‌పై ఆశలు పెట్టుకున్నాయి. హైఎండ్ కార్లకు డిమాండ్ బాగుండడంతో ఈ ఏడాది పండుగ సీజన్‌లో అమ్మకాలు పెరుగుతాయని మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ అంచనా వేస్తున్నాయి. ఎప్పుడులేనంతగా ఈ ఏడాది సేల్స్ బాగుంటాయని బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ అన్నారు. సాధారణంగా పండుగ సీజన్‌లో సేల్స్ డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తాయని, దీంతో అంతకు ముందు క్వార్టర్‌లో సేల్స్ తగ్గినా ఓవరాల్‌గా ఆ ఏడాది పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుందని ఆయన వివరించారు. దీనిని బట్టి ఈ ఏడాది పండుగ సీజన్‌లో కూడా రెండెంకల వృద్ధి నమోదు చేస్తామని అన్నారు.
మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్‌లో లగ్జరీ కార్ల వాటా ఇంకా తక్కువగానే ఉంది. దీనిపై సంతోష్ స్పందించారు. లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో సేల్స్ రికార్డ్ లెవెల్‌లో నమోదవుతాయని, కానీ అన్ని కంపెనీల సేల్స్ పెరగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘కొన్ని కంపెనీల సేల్స్ పడిపోతున్నాయి. మరి కొన్నింటివి ఫ్లాట్‌గా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం 50 వేల నుంచి 51 వేల లగ్జరీ కార్లు అమ్ముడవుతాయని చెప్పగలం’ అని సంతోష్ వివరించారు. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ప్యాసింజర్ వెహికల్స్‌లో లగ్జరీ కార్ల వాటా కేవలం 2 శాతం కూడా లేదు.
దసరా, దీపావళికి కొత్త బుకింగ్స్
ప్రస్తుత ఫెస్టివల్ సీజన్‌లో వినియోగదారులు కొనుగోలు జరపడానికి వెనుకాడరని ఆడి ఇండియా హెడ్ బల్పిర్ సింగ్ ధిల్లన్ అభిప్రాయపడ్డారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్స్‌బ్యాక్, క్యూ5, క్యూ7, కొత్తగా లాంచ్ చేసిన క్యూ8 వంటి తమ మోడల్స్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోందని అన్నారు. ఈ–ట్రాన్ రేంజ్, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ ఈ–ట్రాన్ జీటీ మోడల్స్ కూడా కన్జూమర్లను ఆకర్షిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లగ్జరీ కార్ల మార్కెట్‌పై బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ కూడా సానుకూలంగా ఉన్నారు.
ఇండియా ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉందని, వినియోగం పుంజుకుందని అన్నారు. ‘మాకు ఇండియా నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. డెలివరీలను వేగంగా పూర్తి చేయడానికి పనిచేస్తున్నాం. దసరా, దీపావళి టైమ్‌లో వచ్చే కొత్త బుకింగ్స్ కూడా కలుపుకుంటే ఈ ఏడాది మంచి గ్రోత్ నమోదు చేస్తామని నమ్ముతున్నాం’ అని వివరించారు.