![వీధి కుక్కల దాడులను తగ్గించేందుకు మెర్సీ కిల్లింగ్!](https://static.v6velugu.com/uploads/2025/02/mercy-killing-to-reduce-attacks-by-street-dogs_pjK2BcVkIw.jpg)
- హైకోర్టు అనుమతి కోసం జీహెచ్ఎంసీ అఫిడవిట్
- ఈనెల 25న జరగనున్న విచారణ
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లో వీధి కుక్కల దాడులను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ మెర్సీ కిల్లింగ్(ఇథనేషియా) చేయాలని భావిస్తోంది. అనుమతి కోసం ఇప్పటికే బల్దియా అధికారులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రోజురోజుకు కుక్కల దాడుల్లో గాయపడుతున్నవారు, చనిపోతున్నవారు ఎక్కువవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4 లక్షల వరకు వీధి కుక్కలు ఉన్నాయి. ఇందులో 80 శాతం కుక్కలకు స్టెరిలైజేషన్(యానిమల్ బర్త్ కంట్రోల్) పూర్తిచేశారు. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయినప్పటికీ కుక్క కాట్లు ఆగడం లేదు. 2019 నుంచి 2024 డిసెంబర్ వరకు 1,76,896 డాగ్ బైట్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పదుల సంఖ్యలో మరణించారు. రోజూ ఎక్కడో ఓ చోట కుక్క కాటు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఎండాకాలంలో కుక్క కాట్లు, బాధితులు భారీగా పెరుగుతున్నారు. చిన్నపిల్లలను బయటకి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రెవెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యనిమాల్స్ యాక్ట్ 1960 ప్రకారం ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్, ఫెరోషియస్, బ్యాడ్ టెంపర్ డాగ్స్ ను మాత్రమే మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని గత నెల 10న హైకోర్టులో జీహెచ్ఎంసీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నెల 25న వాదనలు జరగనున్నాయి. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.
రెండు రాష్ట్రాల్లో అనుమతి
కుక్కల మెర్సీ కిల్లింగ్ కు హైకోర్టు అనుమతి తప్పనిసరి. ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్, ఫెరోషియస్, బ్యాడ్ టెంపర్ డాగ్స్‌ను మాత్రమే మెర్సీ కిల్లింగ్‌కు అనుమతిస్తారు. గతంలో దాడులు చేసిన, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న కుక్కలను మెర్సీ కిల్లింగ్ చేయొచ్చు. హైకోర్టు అనుమతిస్తే యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2008లో బాంబే హైకోర్టు, 2015లో కేరళ హైకోర్టులు మెర్సీ కిల్లింగ్ కి అనుమతిచ్చాయి. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ యానిమల్ యాక్టివిస్టులు సుప్రీం కోర్టుకు వెళ్లారు.
కేంద్ర పశుసంవర్ధక శాఖ కూడా 2022లో తెచ్చిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ లో మెర్సీ కిల్లింగ్ ను సమర్థించింది. 2023లో అంబర్ పేటలో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ హైకోర్టులో మెర్సీ కిల్లింగ్ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే కుక్కల మెర్సీ కిల్లింగ్ ను జంతు ప్రేమికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.