పంచాయతీలుగానే ఉంచాలి

  • మున్సిపాలిటీల్లో కలపొద్దంటూ గ్రామసభల్లో తీర్మానాలు
  • అమీన్ పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో 11 గ్రామాల విలీనానికి కసరత్తు
  • పన్నుల భారం పెరుగుతుందని ఆయా పంచాయతీల ప్రజల ఆందోళన
  • రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహ నేతలకు అడియాసలే..!

సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్, అమీన్ పూర్ మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనాన్ని ఆయా గ్రామాల ప్రజలు వద్దంటున్నాన్నారు. రెండు మున్సిపాలిటీల్లో11 గ్రామాలను కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేపట్టింది. గ్రామసభలు కూడా నిర్వహించింది. అయితే.. తమ గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపొద్దనిఆయా పంచాయతీల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. పరిస్థితులను బట్టి న్యాయపోరాటం కూడా చేస్తామని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. పంచాయతీలుగా ఉన్న తమ గ్రామాలను విలీనం చేస్తే పన్నుల భారం, వాటర్ బిల్లులు కూడా మరింత పెరుగుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యధావిధిగా కొనసాగించాలని అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. 

జీహెచ్ఎంసీలోకి తెచ్చేందుకు..

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న మొత్తం 33 పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు విలీన ప్రక్రియపైనా సిద్ధమవుతోంది. ఆపై మొత్తంగా 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే పటాన్ చెరు సెగ్మెంట్ లోని11 గ్రామాలను కూడా తెల్లాపూర్, అమీన్ పూర్ మున్సిపాలిటీల్లో ముందుగా విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.

మరోవైపు విలీన ప్రక్రియ ఆయా పంచాయతీల్లోని రాజకీయ నేతలను కలవరపెడుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. పటాన్ చెరు, అమీన్ పూర్ మండలాల పరిధిలో దాదాపు 200 మంది లీడర్లు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటూ.. ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు. గ్రామాల విలీన ప్రక్రియ కాస్త లీడర్ల ఆశలపై నీళ్లు చల్లింది. 

ఇవే విలీన గ్రామాలు 

పటాన్ చెరు మండలంలోని పాటి, ఘనపూ ర్, కర్దానూర్, ముత్తంగి, పోచారం, అమీన్ పూర్ మండలంలోని పటేల్ గూడ, కృష్టారెడ్డి పేట, సుల్తాన్ పూర్, ఐలాపూర్, ఐలాపూర్ తండా, దయరా గ్రామాలు ఉన్నాయి. వీటిని మున్సిపాలిటీల్లో కలిపేందుకు ప్రతిపాదన లు కూడా జిల్లా పంచాయతీ శాఖ రెడీ చేసిం ది.  న్యాయపరమైన చిక్కులు రాకుండా  డీ నోటిఫై చేస్తూ గెజిట్ ద్వారా మున్సిపాలిటీల్లో విలీనం చేస్తారు. ఆ తర్వాత మున్సిపాలిటీల ను జీహెచ్ఎంసీలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.