Ugadi Rasi Phalalu 2023 - Mesham Rashi : మేష రాశి ఫలితాలు

Ugadi Rasi Phalalu 2023 - Mesham Rashi : మేష రాశి ఫలితాలు

గురువు 21.3.2023 నుంచి మరలా ఉగాది వరకు 8.4.2024 రజితమూర్తిగా సంచారం. శని ఉగాది నుంచి మరలా ఉగాది వరకు లాభంలో లోహమూర్తిగా సంచారం. రాహువు, కేతువులు ఉగాది నుంచి 30.10.2023 వరకు రజితమూర్తులుగా, తదుపరి ఉగాది వరకు వ్యయంలో రజిత మూర్తులుగా సంచారం. ఈ రాశి స్త్రీ, పురుషులకు సామాన్యంగా ఉంటుంది. రైతు సోదరులకు ముహుర్త బలంతో అనుకూలం. వృత్తి వ్యాపారస్తులు తగాదాలు లేకుండా జాగ్రత్తలు పాటించగలరు. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో మాట పట్టింపులు లేకుండా చూసుకోగలరు. డాక్టర్లు, లాయర్లు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కాంట్రాక్టర్లు జాగ్రత్తగా టెండర్లు వేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సంయమనం పాటించాలి. కిరాణా వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. వెండి, బంగారం, ఇనుము, సిమెంట్‌, టేకు ధరలు నిలకడగా ఉండవు. కంకర ధరలు స్థిరంగా ఉండవు. కెమికల్‌ ఇండస్ట్రీల్లో లాభనష్టాలు ఉంటాయి. సగంధ ద్రవ్యాలు వ్యాపారుల చేతిలో ఉంటాయి. స్మగ్లింగ్‌ వ్యాపారులు చట్టం నుంచి తప్పించుకోలేరు. కోర్టు కేసులు రాజీ మార్గం వలన కొంత అనుకూలం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. దొంగలతో జాగ్రత్త. హంగు ఆర్భాటాలకు సమయం కాదు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు సరస్వతి దేవి ద్వాదశ నామాలు చేయండి. పెళ్లి కాని వారి వివాహ ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు. విందులు, వినోదాలలో జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడి, ఎక్కువ పనులు చేసుకోవాలి. 

ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిల్వ ఉన్న ధనం ఖర్చయ్యే అవకాశాలు ఉన్నవి. రాజకీయ నాయకులకు కొన్ని విధములుగా ఆకస్మిక ధనాదాయం ఉంది. ఖర్చుల విషయంలో ప్రత్యేకంగా కార్యం పట్ల తగు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. అనుకోని సంఘటనలు, ఆకస్మికంగా ఏదో ఒక సమస్య వచ్చి పడే అవకాశాలు. స్థాన చలనం. కంప్యూటర్‌‌ రంగం వారు తొందరపాటు లేకుండా మసలుకోవాలి. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు గ్రహ కలయికలో వచ్చే దోషాలను అదుపులో ఉంచగలవు. గృహ శాంతి కోసం అఖండ దీపారాధన చేయాలి. అశ్వినీ నక్షత్రం వారు జాతి వైఢూర్యం ధరించాలి. వినాయకుడు, సరస్వతి, చిత్రగుప్తునికి పూజలు చేస్తే  అనుకూలంగా ఉంటుంది. భరణి నక్షత్రం వారు జాతి వజ్రం ధరించాలి. లక్ష్మీదేవి పూజలు, కనకధార స్తోత్ర పారాయణం చేయాలి. కుసుమ నూనెతో దీపారాధన, కుంకుమ పూజలు, శ్రీచక్రం ఇంట్లో ఉండటం మంచిది. కృత్తిక నక్షత్రం వారు జాతి కెంపు ధరించి, ఆదిత్య పారాయణం చేయాలి. ఆదివారం నియమములు పాటించాలి. సూర్య నమస్కారాలు, యోగా ధ్యానం చేయాలి. మహాన్యాస రుద్రాభిషేకం లేక శివ పంచాక్షరి నామములు పఠించాలి. ఆరుద్ర నక్షత్రం వారు మృత్యుంజయ జపములు వల్ల తగాదాలు లేకుండా మనఃశ్శాంతి ఉంటుంది. ఈ సంవత్సరంలో కూడా చాలా సందర్భాల్లో గత సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9.

మేష రాశి మాస ఫలితాలు..

చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ, పురుషులు బంధుమిత్రులతో చాలా  జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మాటపట్టింపులు. విద్యార్థులు ఇష్టంగా కష్టపడి చదవాలి. ప్రతి విషయంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. వినాయక, సరస్వతి పూజలు, నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచిది.

వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ, పురుషులకు తమ జీవితాల్లో ఏమి జరుగుతుందో అర్థం కాక విధంగా గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక, శత్రువులతో, దగ్గరి బంధువులతో సమస్యలు ఉంటాయి. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య సమస్యలు. తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేయాలి. నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచిది.

జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు వృత్తి ఉద్యోగాల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. మాటపట్టింపులకు ఇది సమయం కాదు. అవసరమైనప్పుడు మాత్రమే స్పందించాలి. మౌనంగా ఉండాలి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు. నిత్య దీపారాధన చేయాలి.

ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు కొంత వరకు గత నెల కంటే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పిల్లల కోరికలు తీర్చడంలో చాకచక్యంగా ఉండాలి. శత్రువులు మిత్రులుగా మారతారు. అమ్మవారి పూజ తప్పనిసరిగా చేయండి.

అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు వృత్తి వ్యాపారాల్లో గత నెలల కంటే కొంత ఉపశమనం ఉంటుంది. జాగ్రత్తలు పాటించిన వారికి ఇంకా కొంత వెసులుబాటు ఉంటుంది. పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు. తక్కువ మాట్లాడి, ఆనందంగా ఉండండి. అమ్మవారి పూజ చేయండి.

నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. సంతృప్తికరమైన రోజులు గడుపుతారు. దక్షిణామూర్తికి ప్రతి రోజు పూజలు చేయండి. గురు బలం తక్కువగా ఉంది.

భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురు బలం లేదు. సాయిబాబా, దక్షిణామూర్తిని పూజించాలి. వ్యాపార వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు. ఊహించని విధంగా ఖర్చులు రాగలవు. ఖర్చులను అదుపులో పెట్టుకొని, చాకచక్యంగా నడుచుకోవాలి. నిర్లక్ష్యం వలన ఆకస్మిక ప్రమాదాలు.

ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఆకస్మిక ఖర్చులు. బంధుమిత్రులతో అనుకోని విధంగా మాట పట్టింపులు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త. బయటకు వెళ్లేటప్పుడు శకునం చూసుకొని బయలుదేరాలి. నవగ్రహ ప్రదక్షిణలు చేయటం మంచిది.

కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు శత్రువుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. ఈతి బాధలు కూడా ఉంటాయి. ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు. ప్రతి విషయం అర్థం కాని విధంగా ఉంటుంది. ఆడంబరాలకు ఇది సమయం కాదు. అమ్మవారిని పూజించడం వల్ల ఎనలేని శక్తి వస్తుంది.

మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెల సామాన్యం. ఆర్థికంగా కొంతమేర పుంజుకోగలరు. ప్రతి విషయంలో ఆచితూచి నడుచుకోగలరు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మహావ్యాస రుద్రాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే అనుకూలం.

పుష్య మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, బంధుమిత్రులు అనుకూలంగా ఉంటారు. మొదటివారం కంటే రెండో వారంలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. వినాయకుడు, సరస్వతీ దేవిని పూజించడం మంచిది. లక్ష్మీనారాయణ, శ్రీసూర్య నారాయణలను పూజించాలి.

మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సంఘంలో గౌరవ మన్ననలు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 
పాత బాకీలు తీరిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆభరణాలు, స్థలాలు కొనడంలో పట్టుదల కలిగి ఉండండి. పంతాలు వదిలి ప్రయత్నిస్తే విజయం మీదే. అందుకోసం కొన్ని నియమాలు పాటించండి. ఇష్టదైవరాధన చేయడం చాలా అవసరం.

ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెల సంతృప్తికరం. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శాంతి కోసం అఖండ దీపారాధన చేయాలి. విందు వినోదములతో ఆనందము. దోషాలు పోవడానికి ఇష్టదైవారాధన చేయుట వలన మనఃశ్శాంతి కలుగుతుంది.