గంగాజలంతో మెస్రం వంశీయుల రాక

గంగాజలంతో మెస్రం వంశీయుల రాక

గుడిహత్నూర్, వెలుగు: ఆదివాసీల ఇలవేల్పు, ఆరాధ్యదైవం కేస్లాపూర్‌ నాగోబా జాతర ఈ నెల  9న ప్రారంభం కానున్న నేపథ్యంలో జన్నారం మండలంలోని హస్తిన మడుగునుంచి సేకరించిన పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు సోమవారం ఉదయం ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ వాయిద్యాలు కాలికోం, తుడుం వాయిస్తూ  గంగాజలంతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గంగాజలాన్ని ఆలయం ముందున్న మర్రి చెట్టుపై భద్రపరిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఆతర్వాత  గారెలు, జొన్న గట్క  నైవేద్యాలను  ఇంద్రాదేవికి  సమర్పించారు. 

మూడు రోజుల పాటు బస

ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 22 కితల మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లతో ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.  రాత్రి కేస్లాపూర్‌ సమీపంలోని మర్రి చెట్టువద్దకు చేరి బస చేశారు. వారంతా  మంగళవారం రాత్రి పటేల్‌కితకు చెందిన మెస్రం వంశీయులకు మర్రి చెట్టు వద్ద  స్వాగతం పలుకుతారు.  మరణించిన పెద్దల పేర్లతో మర్రిచెట్టు దగ్గర తూమ్‌(కర్మకాండ) పూజలు చేయనున్నారు.    

ప్రధాన్‌కితకు చెందిన మెస్రం దాదారావ్‌ ఆధ్వర్యంలో నాగోబా చరిత్ర భోదిస్తారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకొని ఈ నెల  9 న రాత్రి 10:30 గంటలకు నాగోబాకు  గంగాజలంతో అభిషేకం చేసి జాతరను ప్రారంభించనున్నట్లు  ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశ పెద్దలు మెస్రం కోసు కటోడ,  కోసేరావ్, దాదారావ్, హనుమంత్‌రావ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.