
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు తమకు ఫోన్లో మెసేజ్లు వచ్చినా బ్యాంక్ ఆఫీసర్లు తమకు రుణాలు మాఫీ కాలేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు వద్ద అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామానికి చెందిన యాభై మందికి పైగా రైతులు బ్యాంకుకు వచ్చి తమకు వచ్చిన మెసేజ్లను బ్యాంకు ఆఫీసర్లకు చూపించారు. అయితే రుణమాఫీ కాలేదని మేనేజర్ తెలపడంతో ఆగ్రహంతో రైతులు బ్యాంకు ముందు బైఠాయించి ధర్నా చేశారు. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న మెదక్ టౌన్ సీఐ వెంకటేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపచేశారు. తర్వాత సీఐ వెంకటేశం రైతులతో కలిసి మేనేజర్ వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేనేజర్ నరేంద్ర మాట్లాడుతూ.. బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని, ఇక్కడకు తాను కొత్తగా వచ్చానని ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వెంటనే ఫోన్లో మాట్లాడారు. రైతులకు సంబంధించిన వివరాలను తీసుకుని వారం, పది రోజుల్లో సమస్య పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.