న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నుంచి ట్విట్టర్‌లో అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎప్పుడూ బీజేపీ అంటే ఉప్పు – నిప్పులా ఉండే ఒవైసీ మంగళవారం ప్రధానమంత్రి చేసిన ఓ ట్వీట్‌కు ‘వెరీ గుడ్ సర్’ అంటూ రెస్పాండ్ అయ్యారు. ఇందు కారణం ప్రధాని మోడీ ఇవాళ (మంగళవారం) దలైలామా (86)కు బహిరంగంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమే.
2018 తర్వాత ఓపెన్‌గా చెప్పలే..
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం టిబెటన్ బౌద్ధ గురు దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. లామాను ఫోన్ ద్వారా విష్ చేసిన మోడీ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే టిబెట్‌ను చైనా ఆక్రమించిన నేపథ్యంలో 1959లో దలైలామా అనేక మంది టిబెటన్ పౌరులు, బౌద్ధ సన్యాసులతో కలిసి భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివసిస్తూ టిబెట్‌కు ప్రవాస పాలకుడిగా ఉంటున్నారు. అయితే దీనిని లామా పాలనను చైనా అంగీకరించడం లేదు. ఆయనకు ఇండియా ఆశ్రయం ఇవ్వడంపైనా చైనా గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని 2018లో రెండు దేశాలూ ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడాది నుంచి ప్రధాని మోడీ ఎప్పుడూ దలైలామాను కలవడం గానీ, ఓపెన్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు లాంటి చెప్పడం గానీ చేయలేదు. నిరుడు గాల్వాన్ లోయలో చైనా, భారత్ సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిన మన సైనికులు 20 మంది మరణించినా కూడా మోడీ ఓపెన్‌గా శుభాకాంక్షలు చెప్పలేదు.
నేరుగా కలిస్తే చైనాకు గట్టి మెసేజ్‌లా ఉండేదన్న ఒవైసీ
ప్రధాని మోడీ ఈ ఏడాది దలైలామాకు ఓపెన్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్టు ప్రకటించడంతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ‘‘వెరీ గుడ్ సర్”అంటూ ట్వీట్ చేశారు. అయితే మోడీ నేరుగా వెళ్లి లామాను కలిసి విష్ చేసి ఉంటే చైనాకు గట్టి మెసేజ్ ఇచ్చినట్టు ఉండేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు.
Very good, sir! But it would have sent a strong message to China had you met HH Dalai Lama in person https://t.co/gtjOwW58GB
— Asaduddin Owaisi (@asadowaisi) July 6, 2021