టెల్అవీవ్ : హమాస్ టెర్రరిస్టులు ఆయుధాలు వీడి బందీలను విడుదల చేస్తే, రేపే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. హమాస్ టెర్రరిస్టులు దయచేసి ఆయుధాలు వీడాలని ఆయన హితవు పలికారు. గాజా ప్రజలను ఉద్దేశిస్తూ నెతన్యాహు మాట్లాడారు. ఆ వీడియోను ఇజ్రాయెల్ ఎక్స్ లో షేర్ చేసింది. ‘‘నిరుడు అక్టోబరు 7 నాటి ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ హతమయ్యాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు చెందిన సైనికులు రఫాలో అతడిని మట్టుబెట్టారు.
అయితే, గాజాలో ఇది యుద్ధం ముగింపుకు అంతం కాదు. అంతానికి ఇది ఆరంభం మాత్రమే. గాజా ప్రజలకు నేను ఒకటే చెప్పదలచుకున్నా. హమాస్ ఆయుధాలు వీడి, బందీలను మాకు అప్పగిస్తే, రేపే యుద్ధం అయిపోతుంది. ప్రస్తుతం హమాస్ వద్ద 23 దేశాలకు చెందిన పౌరులు బందీలుగా ఉన్నారు. వారిలో మా (ఇజ్రాయెల్) పౌరులు కూడా ఉన్నారు. వారందరినీ తిరిగి ఇంటికి పంపేందుకు మేము చేయాల్సిందంతా చేస్తున్నాం. బందీలను అప్పగించే వారందరికీ ఎలాంటి ముప్పు ఉండదని నేను హామీ ఇస్తున్నా. వారిని అలాగే ఉంచుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని నెతన్యాహు పేర్కొన్నారు.