తెలంగాణలో ఒకట్రెండు రోజులు వానలు .. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీ  

తెలంగాణలో ఒకట్రెండు రోజులు వానలు .. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీ  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకట్రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్​లోనూ రెండు రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 

సడన్​గా మారుతున్నది

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదయమంతా ఎండ కొడుతున్నా.. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతున్నది. మబ్బులు పట్టి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్​తో పాటు భూపాలపల్లి, యాదాద్రి, నల్గొండ, వికారాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. భూపాలపల్లి జిల్లా చేల్పూరులో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సూర్యాపేట జిల్లా పెద్దవీడులో 5.1, యాదాద్రి జిల్లా వలిగొండలో 4.5, నందనంలో 3.8, హనుమకొండ జిల్లా మడికొండలో 3.7, సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో 3.4, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 3.4, మహబూబాబాద్​ జిల్లా భూపతిపేటలో 3.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్​ సిటీలో సాయంత్రం ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అడ్డగుట్టలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెట్టుగూడలో 2.9, కూకట్​పల్లిలో 1.6, ఉప్పల్​లో 1.4, బన్సీలాల్​పేటలో 1.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.