- రాష్ట్రానికి మళ్లీ భారీ వర్షాల ముప్పు
- ప్రస్తుతానికి తెరిపినిచ్చిన వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు తెరిపినిచ్చాయి. వానలు తగ్గుముఖం పట్టినా, వాటి తాలూకు విషాదం మాత్రం ప్రజలను వీడలేదు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గినా.. వారం తర్వాత మరోసారి వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది. మరో రెండు రోజులపాటు దాని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రెండు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయితే దాని ప్రభావం తగ్గాక వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది.
నిన్న పలు జిల్లాల్లో మోస్తరు వర్షం..
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాది జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో అత్యధికంగా 24.1 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే జిల్లా తాడ్వాయిలో 20.9, రామారెడ్డిలో 20.8, లింగంపేట, కామారెడ్డిల్లో 20.3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 17.9, నిజామాబాద్ జిల్లా సిర్కొండలో 17.2, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 16.8, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో 16.1, మెదక్ జిల్లా పాపన్నపేటలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక, సోమవారం సాయంత్రం వరకు ఉత్తరాది జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచి మబ్బులు పట్టింది. తేలికపాటి జల్లులు కురిశాయి.
Also Read:-పంట నష్టం కింద ఎకరాకు 10 వేలు
గోదావరి బేసిన్‌కు పోటెత్తిన వరద
ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న గోదావరి బేసిన్‌లో ఇప్పుడు జోరు వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు సీజన్‌లో తొలిసారి 2.50 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ప్రాజెక్ట్‌కు 2,51,250 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 3.3 లక్షల క్యూసెక్కులను స్పిల్ వే ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు కూడా 2,78 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వస్తుండగా.. 4.02 లక్షల క్యూసెక్కులను క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ నుంచి 6.8 లక్షలు, సమ్మక్కసాగర్ నుంచి 4.21 లక్షలు, సీతమ్మసాగర్ నుంచి 3.33 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద 3.08 లక్షల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు.
కృష్ణా బేసిన్ లోనూ వరద ప్రవాహం
కృష్ణా బేసిన్‌లోనూ వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాలకు 3.2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తంలో వరదను కిందకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 4.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5.53 లక్షల క్యూసెక్కులను సాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు 5.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తం దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఇటు నాగార్జునసాగర్ అటు మున్నేరు, పాలేరుల నుంచి వస్తున్న వరదలతో ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. బ్యారేజీ నుంచి 11.28 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తాడేపల్లి వద్ద కృష్ణా కరకట్టకు గండి పడడంతో పక్కన ఉన్న ప్రాంతాలు జలమయమయ్యాయి.