- వికారాబాద్ జిల్లా తాండూర్‌లో 5.1 సెంటీమీటర్ల వాన
- హైదరాబాద్‌లో పొద్దంత మబ్బులే.. సాయంత్రం వర్షం
- బేగంపేటలో అత్యధికంగా 1.5 సెంటీమీటర్ల వాన
- తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతున్నది. ఆదివారం వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
నిజామాబాద్ జిల్లా పోతంగల్, నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్లో 4.6, బాసరలో 4.3 సెంటీ మీటర్ల చొప్పన వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా సిరిపురంలో 3.7, నారాయణపేట జిల్లా నర్వలో 3.1, జోగులాంబ గద్వాల జిల్లా డ్యాగదొడ్డిలో 2.9, మహబూబ్‌నగర్ జిల్లా శేరివెంకటాపూర్‌లో 2.8, వనపర్తి జిల్లా ఘనపూర్‌లో 2.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షం రికార్డయింది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
హైదరాబాద్ సిటీ అంతా వర్షం..
హైదరాబాద్ సిటీలో ఆదివారం ఉదయం నుంచి వాతావరణం మబ్బులు పట్టి ఉంది. సాయంత్రానికి పలుచోట్ల వర్షం కురిసింది. మోస్తరు వర్షానికే చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. సిటీ అంతటా వర్షపాతం రికార్డ్ అయింది. బేగంపేటలో అత్యధికంగా 1.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్ (వెంకటేశ్వర కాలనీ)లో 1.5, ప్రశాంత్‌నగర్‌లో 1.2, వెస్ట్‌మారేడ్‌పల్లిలో 1.2, మెట్టుగూడ, పికెట్, బన్సీలాల్పేటల్లో 1.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
కాగా, మరో రెండు రోజుల పాటు సిటీలో ఇలాంటి వాతావరణమే కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.