
మార్చి 2 వరకు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ
37 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే చాన్స్
వేడి గాలుల కారణంగా పెరిగిన ఎండ తీవ్రత
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 2 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. మంగళవారం గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.
హైదరాబాద్‌లో ఈ ఐదు రోజులు 34- నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని చెప్పింది. వేడి గాలులు వీస్తున్నాయని, అందుకే ఎండల తీవ్రత పెరుగుతున్నదని వివరించింది. ఈ ఎండా కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బయటికెళ్లేటప్పుడు నీళ్లు, చల్లని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపింది.
ఉదయం 11 తర్వాత బయటికి వద్దు
ఎండ ఎక్కువగా ఉన్న టైమ్‌లో చిన్నపిల్లలు, 65 ఏండ్లు దాటినవారు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏవైనా పనులుంటే ఉదయం 11 గంటల్లోపు.. సాయంత్రం 4 గంటల తర్వాత పెట్టుకోవాలంటున్నారు. హై టెంపరేచర్, వీక్నెస్, హెడెక్, తీవ్రమైన దాహం, గొంతు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, చెమటలు రాకపోవడం, చర్మం ఎర్రగా మారడం, శ్వాస సమస్యలు, హార్ట్ బీట్ పెరగడం, వికారం, వాంతులు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలుంటే వడ దెబ్బ అని గ్రహించి హాస్పిటల్‌కు వెళ్లాలని కోరుతున్నారు.
రోజూ 5 లీటర్ల నీళ్లు తాగాలి
రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండ వేడి వల్ల శరీరంలోని నీరంతా చెమట ద్వారా బయటికి వెళ్తుందని, బాడీలో నీటి శాతం బ్యాలెన్స్‌గా ఉండాలంటే 5 లీటర్ల వాటర్ తాగాలంటున్నారు.
మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, నేచురల్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం హెల్త్‌కు మంచిదంటున్నారు. కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ఫుడ్కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ వేడి లోపలికి రాకుండా మధ్యాహ్నం తలుపులు మూసి ఉంచాలని, సాయంత్రం లోపలి గాలంతా బయటికి వెళ్లేందుకు తలుపులు తెరవాలని చెప్తున్నారు. కాటన్ డ్రెస్సులు వేసుకోవాలని, దీంతో చెమట ద్వారా చర్మ వ్యాధులు రావని సూచిస్తున్నారు.