- 22 జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదు
- అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీలు
- పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడ్తున్నాయి. వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం 13 జిల్లాలకు.. శని, ఆదివారాల్లో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వడగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుందని గురువారం రిలీజ్ చేసిన బులెటిన్లో తెలిపింది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో టెంపరేచర్లు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య నమోదవుతాయని హెచ్చరించింది.
ఆయా జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువ రోజులు కొనసాగే ముప్పు ఉందని తెలిపింది. మరోవైపు 7, 8వ తేదీల్లో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. గురువారం నల్గొండ, సిద్దిపేట, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, జోగులాంబ గద్వాల, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించింది.
8 జిల్లాల్లో 46 డిగ్రీలపైనే..
గురువారం 8 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. ఆ జిల్లాలోని 22 మండలాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైన టాప్ టెన్ ప్రాంతాల్లో ఐదు ఒక్క నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి. ఇబ్రహీంపేట 46.6, మునగాల (సూర్యాపేట) 46.4, నేరెళ్ల, వెల్గటూరు (జగిత్యాల), నాంపల్లి (నల్గొండ)లో 46.4, జన్నారం (మంచిర్యాల) 46.3, కేతేపల్లి (నల్గొండ), మాడుగులపల్లి (నల్గొండ) 46.2, తెల్దేవరపల్లి (నల్గొండ) 46.2, సుగ్లాంపల్లి (పెద్దపల్లి) 46.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 22 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.