- మరో రెండ్రోజులు వానలు: వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు: మరో రెండ్రోజులపాటు గ్రేటర్ పరిధిలోని 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రెండు జిల్లాలో రాబోయే రెండ్రోజుల పాటు11 నుంచి 20 సెంమీల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ 6 నుంచి 11 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం సైతం గ్రేటర్ పరిధిలో ముసురు కొనసాగింది. అత్యధికంగా ఏఎస్ రావునగర్, కుత్బుల్లాపూర్‌లో 1.6 సెం.మీ వాన పడింది. మరో రెండ్రోజులు వానలుంటాయని.. సిటిజన్లు ఏదైనా అత్యవసరమైతే బల్దియా కంట్రోల్ రూమ్ - 040--21111111 లేదా 040--29555500 నంబర్లకు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. శామీర్ పేట పెద్ద చెరువును మేడ్చల్ జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారు. చెరువు నీటి సామర్థ్యం 33 అడుగులు కాగా.. ప్రస్తుతం 25 అడుగుల నీరు ఉన్నట్లు తెలిపారు. మజీద్‌పురాలోని హనుమాండ్ల కుంట, బాలాజీ కాలనీలో వరద నీరు ప్రవహించే కాలువను పరిశీలించిన అధికారులు సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు. జీడిమెట్లలోని పైప్ లైన్ రోడ్ నుంచి మిత్రా హోమ్స్‌కు వెళ్లే దారిలో, సూరారంలోని శ్రీరాం నగర్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షానికి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని అరోరా కంపెనీ గోడ కూలిపోయింది..
రెండో రోజూ జంట జలాశయాల గేట్లు ఓపెన్
జంట జలాశయాలకు వరద నీరు ఇంకా చేరుతోంది. హిమాయత్‌సాగర్ కు 500, ఉస్మాన్ సాగర్(గండిపేట) కు 300 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో రెండో రోజు కూడా 4 గేట్లను ఎత్తిన అధికారులు మూసీలోకి నీటిని పంపారు. హిమాయత్ సాగర్ నుంచి 686, ఉస్మాన్ సాగర్ నుంచి 208 క్యూసెక్కుల నీటిని కిందకి వదిలారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1760.55 అడుగులు, ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1786 అడుగుల నీరు ఉంది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో వరద నీరు దిగువ ప్రాంతాలైన బండ్లగూడ, కిస్మత్ పూర్, అత్తాపూర్, లంగర్ హౌస్, కార్వాన్, పురానాపూల్ మీదుగా మూసీకి చేరుతోంది.