మోటార్లకు మీటర్లు.. నిజమేంటి?

డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి కంపెనీల నుంచి కరెంట్ కొంటాయి. అవి ఎంత కరెంట్ కొన్నాయో ఉత్పత్తి కంపెనీల వద్ద మీటర్లలో నమోదవుతుంది. ఈ కొన్న మొత్తం కరెంట్​ను డిస్కంలు వినియోగదారులకు సరఫరా చేస్తాయి. ఇలా కొన్న మొత్తం కరెంట్ ను వాడకం ఆధారంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. 1. మీటర్ల ద్వారా వినియోగం, 2. మీటర్లు లేకుండా వినియోగం, 3. సరఫరా, పంపిణీ నష్టాలు. ఈ మూడింటినీ కలిపితే కొన్న మొత్తం కరెంట్ కు సమానంగా ఉండాలి. గృహ, వ్యాపార, పరిశ్రమలు, ఎత్తిపోతలు మొదలైన వాటికి- మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. మీటర్లలో నమోదైన రీడింగ్ ఆధారంగా వాడకం తెలుస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం మీటర్ వినియోగం సుమారు 60 శాతం ఉంది. మీటర్లు లేకుండా సరఫరా జరుగుతున్నది వ్యవసాయరంగానికే. వ్యవసాయ రంగ వాడకం తెలుసుకోవడానికి డిస్కంలు ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తాయి. మొత్తం రాష్ట్రంలో సుమారు 3 లక్షల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ లు ఉన్నాయి. ప్రతీ వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ కింద కొన్ని మోటార్లు ఉంటాయి. రాష్ట్రంలో సుమారు 26 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ట్రాన్స్​ఫార్మర్ల ద్వారా విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. వీటిలో ఎంచుకున్న సుమారు 6 వేల ట్రాన్స్ ఫార్మర్ ల వద్ద మీటర్లు పెట్టారు. వాటి వద్ద తీసిన రీడింగ్ ఆధారంగా మోటార్ల కరెంట్​వాడకాన్ని అంచనా వేస్తున్నారు. 

సరఫరా, పంపిణీ నష్టాలు: లైన్లలో, సబ్ స్టేషన్లలో విద్యుత్తు ప్రవహిస్తున్నప్పుడు కొంత విద్యుత్​ను నష్టపోతాం. ఈ నష్టాలు రెండు రకాలు. మొదటిది, సాంకేతిక నష్టాలు. రెండవది, విద్యుత్ చౌర్యం. సాంకేతిక కారణాల వల్ల నష్టపోయే విద్యుత్తును సాంకేతిక నష్టాలని పిలుస్తారు. ఈ నష్టాలను నియంత్రించడం కొంత కష్టం. ఇదీగాక కొంతమంది వినియోగదారులు, విద్యుత్ లైన్లకు కొక్కాలు వేసో, లేక మీటరును టాంపర్ చేసో విద్యుత్​ను అక్రమంగా వాడుతుంటారు. ఈ రకమైన నష్టాలను విద్యుత్ చౌర్యం, లేదా వ్యాపార నష్టాలంటారు. ఇప్పుడు కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్ నుంచి మీటర్ల ద్వారా వినియోగం, అంచనా వేసిన వ్యవసాయ రంగ వినియోగాన్ని తీసేస్తే సరఫరా, పంపిణీ నష్టాలు ఎంతో తెలుస్తాయి. 

అసలు సమస్య ఇక్కడే..

పై పద్ధతిలో నష్టాల లెక్కలు పూర్తిగా డిస్కంలు వేసే వ్యవసాయ రంగ వినియోగ లెక్కల అంచనా శాస్త్రీయతపైనే ఆధారపడి ఉంటుంది. కానీ కేవలం అతికొద్ది మీటర్లపై ఆధారపడ్డ వ్యవసాయ వినియోగం లెక్కల్లో కచ్చితత్వం లోపిస్తుంది. పైపెచ్చు డిస్కంలు తమ ఇష్టం వచ్చినట్టు ఈ లెక్కలను తారుమారు చేసే అవకాశం ఉంది. వ్యవసాయరంగ వినియోగం లెక్కల్లో కచ్చితత్వం చాలా కీలకం. ఎందుకంటే వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరాకయ్యే ఖర్చు భారీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఖర్చు ఏటా రూ.15 వేల నుంచి18 వేల కోట్ల రూపాయల వరకు ఉంది. రైతులకు ఉచిత విద్యుత్తు విధానం అమలులో ఉన్నప్పుడు, డిస్కంలకు విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చులో ప్రధాన భాగం ప్రభుత్వమే ‘సబ్సిడీ’ రూపంలో భరించాల్సి ఉంటుంది. మిగిలిన భారాన్ని ఇతర వినియోగదారుల నుంచి వారు చెల్లించాల్సిన చార్జీ కన్నా కొంత ఎక్కువ చార్జీ విధించి వసూలు చేస్తారు. ఇలా ఇతర వినియోగదారుల నుంచి వసూలు చేసే అధిక మొత్తాన్ని ‘క్రాస్ -సబ్సిడీ’ అంటారు. అంటే, వ్యవసాయ విద్యుత్ అంచనాలు ఎక్కువగా ఉంటే, ఇతర వినియోగదారులపై, ముఖ్యంగా ప్రభుత్వంపై సబ్సిడీ భారం పెరుగుతుంది. వ్యవసాయరంగ అంచనాలు తక్కువగా ఉంటే ప్రభుత్వంపై భారం తక్కువగా ఉంటుంది.

తప్పుడు అంచనాలు - డిస్కంల ప్రయోజనాలు

సాధారణంగా డిస్కంలు వ్యవసాయ వినియోగ అంచనాలను ఎక్కువ చేయడానికి మొగ్గు చూపుతాయి. దీనివల్ల వాటికి రెండు రకాల ప్రయోజనాలుంటాయి. మొదటిది- ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో సబ్సిడీలు వస్తాయి. రెండోది- వ్యవసాయరంగ వినియోగం ఎక్కువగా ఉంటే, నష్టాలు తక్కువగా కనిపిస్తాయి. దీంతో డిస్కంల పనితీరు బాగా మెరుగ్గా ఉందని బయటకు చెప్పుకోవచ్చు. నష్టాలను తగ్గించుకోవాలనే ఒత్తిడి కూడా డిస్కంలపై ఉండదు. 

వ్యవసాయరంగ కరెంట్ ​వాడకం - సమస్యలు

మోటార్లకు మీటర్లు పెడితే: బయటకు ఇది అతి కచ్చితత్వంతో కూడిన విధానమని అనిపిస్తుంది. కానీ ఈ విధానం మరిన్ని సమస్యలతో కూడినది. లక్షలాది పంపుసెట్లకు మీటర్లు బిగించాలంటే ఖర్చు వేల కోట్లల్లో ఉంటుంది. ప్రతీ నెలా మీటర్ రీడింగ్ తీయడం కూడా కష్టమే. అదనపు ఉద్యోగులు, అదనపు ఖర్చు ఉంటుంది. మోటార్ల వద్ద మీటర్లు బిగిస్తారంటే రైతులు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. 

ట్రాన్స్ ఫార్మర్ వద్ద మీటరు పెట్టడం: ప్రతీ మోటార్ వద్ద మీటరు బిగించకుండా, వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్న అన్ని ట్రాన్స్ ఫార్మర్ లకు మీటరు బిగించి వ్యవసాయ వాడకాన్ని లెక్కించడం మేలు. బిగించాల్సిన మీటర్ల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్రంలో పంపుసెట్లు 26 లక్షలు ఉంటే, వాటికి కరెంట్​ ఇచ్చే ట్రాన్స్​ఫార్మర్ల సంఖ్య సుమారు 3 లక్షలు. తక్కువ మీటర్లతో మొత్తం పంపుసెట్ల వినియోగం తెలుస్తుంది. దీంతో ఖర్చు కొంత మేరకు తగ్గుతుంది. తక్కువ మందితో ఈ మీటర్ల రీడింగులు తీయొచ్చు. వినియోగం అంచనాలలో కచ్చితత్వం పెరుగుతుంది. ట్రాన్స్ ఫార్మర్ వద్ద మీటర్ ఉంటుంది కాబట్టి, ట్రాన్స్ ఫార్మర్ కింద ఉన్న అనధికార కనెక్షన్లనూ లెక్కించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ట్రాన్స్ ఫార్మర్ వద్ద మీటరు పెట్టడానికి రైతుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు. కాబట్టి, ట్రాన్స్ ఫార్మర్ వద్ద మీటర్లు బిగించడం సులభమే గాకుండా, ఇతర అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 

ట్రాన్స్ ఫార్మర్ వద్ద మీటర్లు- రైతుల డిమాండు!

మోటార్ల వద్ద మీటర్లు పెట్టడాన్ని రైతులు, రైతు సంఘాలూ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే, పంపుసెట్లకు మీటర్లు పెట్టి, వినియోగం ఆధారంగా తమ వద్ద బిల్లులు వసూలు చేస్తారనే భయం. అయితే పంపుసెట్టు వద్ద మీటర్లను వ్యతిరేకించిన రైతులు, ప్రతీ ట్రాన్స్ ఫార్మర్ వద్ద మీటరు బిగించాలని మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే, రైతుల వాడకం పేరిట, విద్యుత్ చౌర్యాన్ని, ఇతర నష్టాలనూ, భారీ ఖర్చులను తమ మీదకి నెట్టడం రైతులకు ఇష్టం లేదు. వాస్తవానికి, వ్యవసాయ రంగ వినియోగం ప్రభుత్వాల అంచనాల కన్నా చాలా తక్కువగా ఉంటుంది. చౌర్యాన్ని, ఇతర నష్టాలను వ్యవసాయ వినియోగంలో కలపడంతో ఈ వినియోగం భారీగా కనబడుతుంది. మీటర్లు పెట్టడం డిస్కంలకు ఇష్టం లేదు. దాంతో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టే ప్రక్రియ మొదటి నుంచీ కాగితాలకే పరిమితమైంది.

విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏం చెప్పిందంటే..

2022-23 సంవత్సరంలో మన రాష్ట్రంలో వ్యవసాయరంగ వినియోగం 1763 కోట్ల యూనిట్లుగా తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అంచనా వేసింది. ఒక్కో యూనిట్ సరఫరా ఖర్చు రూ 8.36 దీన్ని కాస్ట్ -టు- సర్వ్ అంటారు. అంటే వ్యవసాయ విద్యుత్​కు అయ్యే మొత్తం ఖర్చు రూ .14,745 కోట్లు. ఇదంతా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ఇతర వినియోగదారుల నుంచి క్రాస్ -సబ్సిడీల రూపంలో వస్తుంది. ఇంత భారీ మొత్తం రైతుల పేరిట ఎలాంటి శాస్త్రీయ అంచనాలు లేకుండా ఖర్చు పెడుతుండటంతో వ్యవసాయ వాడకం లెక్కల ప్రాధాన్యతను గుర్తించిన మన రెగ్యులేటరీ కమిషన్, 2024 నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లకు మీటర్లు పెట్టాలని 2022 మార్చిలో డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది. 

డిస్కంలు మనుగడ సాగించాలంటే..

డిస్కంలు మనుగడ సాధించాలంటే, వ్యవసాయ రంగ వినియోగంపై సరైన లెక్కలు తేలాలి. రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టడం యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాలి. ఈ లెక్కల ఆధారంగా ప్రభుత్వాలు డిస్కంలకు క్రమం తప్పకుండా సబ్సిడీలు చెల్లించాలి. వ్యవసాయ రంగ వినియోగం లెక్కలు తేలడం ద్వారా విద్యుత్ చౌర్యంపై సరైన అవగాహన సాధ్యమౌతుంది. దీని ఆధారంగా చౌర్యాన్ని అరికట్టే పటిష్టమైన చర్యలు తీసుకోవడం వీలవుతుంది. తద్వారా విద్యుత్ సంస్థలు ఆర్థికంగా మెరుగుపడటమే కాకుండా, వినియోగదారులపై చార్జీల భారం తగ్గుతుంది. రైతులు కరెంట్​ బాగా వాడుతున్నారనే నిందలకు ఇక అవకాశం ఉండదు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు డిస్కంలకు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇంత ఖర్చు పెట్టినప్పుడు వాస్తవంగా ఎంత విద్యుత్ రైతులకు చేరిందో శాస్త్రీయమైన లెక్కలుండాలి. దానికి ట్రాన్స్ ఫార్మర్ ల వద్ద మీటర్లు పెట్టడం సరైన చర్య. ఇది రైతులకు, ప్రభుత్వానికి, డిస్కంలకు ప్రయోజనకారి. ప్రభుత్వాలు సబ్సిడీలు, బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో డిస్కంలు లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయి. రాష్ట్రాల వైఖరి ఇలాగే కొనసాగితే, మీటర్లతో సంబంధం లేకుండా ఉచిత పథకాలు కొనసాగించలేమని డిస్కంలు చేతులెత్తేసే రోజులు మరెంతో దూరంలో లేవు. ఈ పరిస్థితి రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం సరైన చర్యలు తీసుకోవాలి.

- తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ