పక్కాగా నీటి లెక్క: వాటర్ గ్రిడ్ నల్లాలకు మీటర్లు

వాటర్‍గ్రిడ్‍ పథకం ద్వారా సరఫరా  అయ్యే నీటి వినియోగానికి సంబంధించిన లెక్కా ఇక  పక్కాగా తేలనుంది.  వాటర్‍గ్రిడ్ పథకం కింద ఇళ్లలో ఉచితంగా ఏర్పాటు చేసిన నల్లాలకు మీటర్లను అమర్చే ప్రక్రియ గురువారం ఆదిలాబాద్​పట్టణంలో ప్రారంభమైంది. విడతలవారీగా ప్రతి ఇంటిలోని నల్లాకు మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఇంటికి శుద్ధ జలాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటర్‍గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇచ్చింది. ఆదిలాబాద్‍ మున్సిపాల్టీ పరిధిలోని 36 వార్డుల్లో  ఇప్పటివరకు 17 వేల నల్లాలను బిగించారు. వాటికి వాటర్‍గ్రిడ్‍ ద్వారా నీటిని కూడా సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటర్‍గ్రిడ్‍ నల్లాలన్నింటికి నీటి లెక్కింపు మీటర్లను అమర్చనున్నారు. తొలుత పట్టణంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఆయా వార్డుల్లో జరిగే నీటి సరఫరాకు అనుగుణంగా మీటర్లను బిగించనున్నారు. తొలుత పట్టణ శివారు కాలనీ అయిన  రణాదీవేనగర్‍,  మున్సిపల్‍ చైర్‍పర్సన్‍ రంగినేని మనీషా ప్రాతినిధ్యం వహిస్తున్న ద్వారకానగర్‍లో మీటర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టారు.  ఆయా కాలనీల్లో ఇప్పటివరకు  వెయ్యి మీటర్లను అమర్చారు.  రోజుకు నాలుగు వార్డుల చొప్పున మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

వినియోగం తెలుసుకునేందుకే…

వాగులు, చెలిమెలు, బావుల్లోని నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలకు శుద్ధజలాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటర్‍గ్రిడ్‍ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెల్సిందే. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి  రోజుకు 90 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున శుద్ధజలాన్ని అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వాటర్‍గ్రిడ్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఎంత నీరు సరఫరా అవుతుందో లెక్కించేందుకు మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల వాటర్‍ సోర్సెస్‍ నుంచి  రోజుకు ఎన్ని లీటర్ల నీరు సరఫరా జరుగుతోంది, ఒక్కో కుటుంబం రోజుకు ఎన్ని లీటర్ల నీటిని ఉపయోగిస్తోందనే విషయాలపై స్పష్టత రానుంది. మొత్తం ఎన్ని లీటర్ల డిమాండ్‍ ఉంది, ఎంతమేర సరఫరా జరుగుతోంది, ఎంత నీరు వృథాగా పోతుందనే విషయాలు ఈ మీటర్ల ద్వారా పక్కాగా తేలనున్నాయి.  ప్రస్తుతానికి నీటి వినియోగాన్ని తెలుసుకునేందుకు మీటర్లను ఏర్పాటు చేస్తున్నప్పటికి భవిష్యత్తులో మీటర్లు సూచించే రీడింగ్‍ ఆధారంగానే బిల్లులు వసూలు చేయనున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మీటర్ల బిగింపు ప్రస్తుతానికి మున్సిపాల్టీకే పరిమితమైనా దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటర్‍గ్రిడ్‍ ద్వారా నల్లాలు బిగించిన ప్రతి ఇంటికి మీటర్లను ఏర్పాటు చేయనున్నారు.