మూవీ మొఘల్: ఆశలు చూపి అత్యాచారాలు చేశాడు

కనిపించిన ప్రతి ఆడమనిషినీ కామంతో చూసి, కన్నూమిన్నూ తెలియక ప్రవర్తిస్తే కటకటాలు లెక్కించాల్సిందే.  హాలీవుడ్​లో సీరియల్​ రేపిస్ట్​లా ముద్రపడ్డ మూవీ మొఘల్​​ హార్వే వీన్​స్టీన్​కి ఇదే గతి పట్టింది. 40 ఏళ్లుగా 80 మందికిపైగా మహిళలను సెక్స్​ కోసం వేధించి, వెంటాడిన పాపం చివరికి పండింది. ‘తప్పు చేసినోడు ఎవడైనా ఎప్పటికైనా చట్టానికి చిక్కుతాడు’ అనేది మరోసారి రుజువైంది. ఏ వ్యక్తి మీదైతే ‘మీ టూ’ ఉద్యమం మొదలై పెద్దఎత్తున బలపడిందో అతడికే పెద్ద శిక్ష పడింది.

వాకర్తో.. వీల్ చైర్​​లో..

ఐదేళ్ల కిందట జరిగిన ఓ యాక్సిడెంట్​లో హార్వే నడుం విరిగింది. దీంతో అతను ప్రస్తుతం వాకర్​ సాయంతో నడుస్తున్నాడు. కోర్టుకు కూడా వీల్​ చైర్​లోనే వచ్చాడు. అతని వయసు, ఆరోగ్యం, పరిగణనలోకి తీసుకొని శిక్షా కాలాన్ని తగ్గించాలని లాయర్లు కోరినా జడ్జి లెక్కలోకి తీసుకోలేదు. ఇద్దరు ఒప్పుకుంటేనే సెక్స్​ అనేది జరుగుతుందన్న హార్వే వాదనను పట్టించుకోలేదు. 23 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేని తీర్పిచ్చారు. మరిన్ని కేసుల్లో లాస్​ ఏంజిల్స్​లో విచారణ జరగాల్సి ఉంది.

హార్వే వీన్​స్టీన్​ గురించి హాలీవుడ్​ సినిమాలు చూసేవాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. షేక్​స్పియర్​ ఇన్​ లవ్​, మలెనా, రిజర్వాయర్​ డాగ్స్​, పల్ప్​ ఫిక్షన్​ లాంటి హాలీవుడ్​ హిట్​ పిక్చర్లను తీశాడు. అతను తీసిన చాలా సినిమాలు ఎన్నో అవార్డులకు నామినేట్​ అయ్యాయి. కొన్ని గెలుచుకున్నాయికూడా. నిర్మాతగా, డైరెక్టర్​గా, ఎగ్జిక్యూటివ్​ ప్రొడ్యూసర్​గా, రైటర్​గా ఎన్నో మూవీలకు పనిచేశాడు. అతనిలో  ఎంత క్రియేటర్​ ఉన్నాడో… అంతకుమించిన ఉమెనైజర్​కూడా ఉన్నాడు. ‘తార’సపడ్డ ఆడవాళ్లందరికీ ఆశలు కల్పించి సినిమా చూపించాడు. కోరికను బయటపెట్టుకోవటానికి అతను సమయం, సందర్భం చూసుకునేవాడు కాదు. మీటింగ్​ అయినా, షూటింగ్​ అయినా, ఇల్లయినా, హోటలైనా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు. బలవంతం చేసేవాడు. లేకపోతే బహుమతులు ఇచ్చి లొంగదీసుకునేవాడు.

చదువుకునే రోజుల్లోనే..

1978లో ‘యూనివర్సిటీ ఆఫ్ బఫెలో’లో మ్యూజిక్​ ప్రొడ్యూసర్​గా ఉన్నప్పటి నుంచే హార్వే వీన్​స్టీన్​​ అమ్మాయిల్ని వలలో వేసుకునేవాడట. తర్వాత సినిమాల్లోకి రావటంతో మరింత రెచ్చిపోయాడు.

ప్రైవేట్​ ఇంటలిజెన్స్​తో చెక్​

మనసుపడ్డ ప్రతి ఆడమనిషి పట్లా హార్వే అసభ్యంగా ప్రవర్తించేవాడు. వాళ్ల బ్రెస్ట్​ని ఓపెన్​గా తాకటానికి కూడా వెనకాడేవాడు కాదు. ఈ ఆరోపణలు మీడియా ద్వారా బయటకు వస్తుండటంతో వాటిని జర్నలిస్టులకు ఎవరు చెబుతున్నారో కనుక్కోవటానికి (వాళ్లను ‘రెడ్​ ఫ్లాగ్స్​’ అనేవాడు) బ్లాక్​ క్యూబ్​ అనే ప్రైవేట్​ ఇంటలిజెన్స్​ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని చేసినా తప్పులు దాగలేదు. కొన్ని న్యూస్​ పేపర్లు ఇతని చీకటి వ్యవహారాలను పూస గుచ్చినట్లు రాసేవి. మహిళలను​ హార్వే ఇబ్బంది పెట్టిన తీరును ‘ది టైమ్స్​’, ‘ది న్యూయార్కర్​​’ పేపర్లు డిటెయిల్డ్​గా రాయటంతో ఆ ఆర్టికల్సే ‘మీ టూ’ మూమెంట్​కి దారి తీశాయి.

జడ్జిని కొన్నాడు–లాయర్లను మార్చాడు

తన ఆఫీసుకు వచ్చిన అంబ్రా బట్టిలానా అనే ఇటాలియన్​ మోడల్​ తనను హార్వే హరాస్​ చేయడంపై పోలీసులకు కంప్లయింట్​ ఇచ్చింది. ఆ కేసులో సాక్ష్యాలు పక్కాగా ఉన్నా అతనిపై చార్జిషీటుకు వ్యాన్స్​ అనే జడ్జి వెనకాడాడు. అతను ఎందుకలా చేశాడా అని కూపీ లాగితే హార్వే డబ్బులిచ్చినట్లు తేలింది. దీంతో ప్రభుత్వం వ్యాన్స్​ని మార్చి వేరే ప్రాసిక్యూటర్​కి ఆ పని అప్పగించింది. అప్పటి నుంచి కేసు విచారణ వేగం పుంజుకుంది. అయితే.. ఇన్వెస్టిగేషన్​ని ఆలస్యం చేయటానికి హార్వే ఇద్దరు లాయర్లను మార్చినా శిక్ష తప్పించుకోలేక పోయాడు.