వడ్డీ వ్యాపారి ఇంట్లో కిలోన్నర బంగారం స్వాధీనం .. రూ. ఏడు లక్షల నగదు సీజ్​

వడ్డీ వ్యాపారి ఇంట్లో కిలోన్నర బంగారం స్వాధీనం .. రూ. ఏడు లక్షల నగదు సీజ్​
  • నలుగురిపై కేసు నమోదు
  • టార్గెట్​ చేశారని పోలీసులతో వ్యాపారి వాగ్వాదం

మెట్ పల్లి, వెలుగు : బంగారు ఆభరణాలు తనఖా పెట్టుకొని అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్న జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన కట్కం రమేశ్​అనే వడ్డీ వ్యాపారి ఇంట్లో పోలీసులు తనిఖీ చేసి కిలోన్నర బంగారం, రూ. ఏడు లక్షలు నగదు సీజ్ చేశారు. మెట్​పల్లి ఎస్ఐ చిరంజీవి కథనం ప్రకారం..మెట్ పల్లిలో పాన్​బ్రోకర్స్​పేరుతో అనుమతులు, లైసెన్సులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని, బంగారం తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు రుణాలిస్తున్నారని సమాచారం రావడంతో పాత బస్టాండ్ సమీపంలోని కట్కం బ్రదర్స్ ఫైనాన్స్ ఆఫీసుతో పాటు, ఇంటిలో శనివారం అర్ధరాత్రి వరకు సోదాలు చేశారు. 

1.506 కిలోల బంగారం ఆభరణాలు, రూ.7 లక్షల నగదు, 13 రిసిప్ట్ బుక్స్​సీజ్ చేశారు. కట్కం రమేశ్, కట్కం ప్రకాష్ , కట్కం శివ, కట్కం కార్తీక్ లపై కేసు నమోదు చేశారు. అయితే, కట్కం రమేశ్​ఇంట్లో సోదాలు చేస్తుండగా రమేశ్​వారిని అడ్డుకున్నారు. పోలీసులు కావాలనే టార్గెట్ చేశారని సీఐ నవీన్, ఎస్సై చిరంజీవితో వాగ్వాదానికి దిగాడు. పట్టణంలో వందకు పైగా వ్యక్తులు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని, వారందరినీ వదిలి తమను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్​కాదన్నారు.

 దీంతో పోలీసులు తాము నిబంధనల మేరకే సోదాలు చేస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు.  కాగా, పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ సమీపంలో, మార్కెట్, గ్రంథాలయం వెళ్లే రోడ్డులో, గోల్ హనుమాన్ ఏరియాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో  రూ.కోట్లలో బహిరంగంగా అక్రమంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారని, వీరి ఇండ్లలో కూడా తనిఖీలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.చాలామంది బంగారం, భూములు తనఖా పెట్టుకుని 5శాతం వడ్డీకి మూడు నెలల పాటు పేపర్ ​రాయించుకుంటారని, మూడు నెలల తర్వాత మరో 3 శాతం వడ్డీ పెంచుతారని, ఇలా ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటు పెంచుకుంటూ పోయి కట్టలేని స్థితికి చేరుస్తారని బాధితులు చెబుతున్నారు.