జగ్గసాగర్​ను మండలం చేయాలని మెట్ పల్లిలో గ్రామస్థుల రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట ఇచ్చి మోసం చేశాడని జగ్గసాగర్ గ్రామస్థులు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం మెట్ పల్లి పట్టణం శాస్త్రి చౌరస్తాలో ధర్నాకు దిగారు. జగ్గసాగర్ గ్రామాన్ని వెంటనే మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల వీడీసీ నాయకులు మాట్లాడుతూ చుట్టూ ఉన్న గ్రామాలకు జగ్గసాగర్ కేంద్రంగా ఉందన్నారు. జగ్గసాగర్​ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందన్నారు. జగ్గసాగర్ ను మండలంగా ప్రకటించాలని వంద రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేశామని, పలుసార్లు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. 13 గ్రామాల పంచాయతీలు తీర్మానం చేసిన కాపీలు సైతం అందజేశామన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో  జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం బందలింగాపూర్ గ్రామాన్ని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు  కోరిక మేరకు మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. మారుమూల గ్రామాలైన రామలచ్చక్కపేట, కొండ్రికర్ల, కోనరావు పేట, ఆత్మనగర్, ఆత్మకూర్, పాటిమీద తండా, కేసీఆర్ తండా, అల్లూరి సీతారామరాజు తండా, రంగారావుపేట, అందుబొందుల తండా, పెద్ద తండా, మెట్లచిట్టపూర్, విట్టంపేట గ్రామాలతో కలిపి జగ్గసాగర్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటూ రానున్న రోజుల్లో భారీఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  సమాచారం అందుకున్న తహసీల్దార్ సత్యనారాయణ ఆందోళనకారులను సముదాయించారు.  సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి తొలగించారు.  అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. 

అల్లీపూర్​లో రాస్తారోకో

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ అల్లీపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూస్తే నిరాశే మిగిలిందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం గ్రామంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ మండలంగా ప్రకటించేందుకు అల్లీపూర్ కు  అన్ని అర్హతలు ఉన్నాయని, ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా  పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి మండలంగా ప్రకటించాలని, లేదంటూ పెద్దఎత్తున ఉద్యమిస్తామని అన్నారు.