మెట్రో పోలిస్​ హోటల్ సీజ్

మెట్రో పోలిస్​ హోటల్ సీజ్
  •     ముత్యాలమ్మ గుడి ఘటనలో రెవెన్యూ అధికారుల యాక్షన్​ 
  •     దాడి జరిగిన రోజే 140 మంది పరార్​
  •     తాజాగా 50 మందిని పంపించి వేసిన ఆఫీసర్లు


సికింద్రాబాద్, వెలుగు :  నాలుగు రోజుల కింద సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు సలీం సహా మరో 140 మంది బస చేసిన మెట్రో పోలిస్ హోటల్ ను గోపాలపురం పోలీసులు, సికింద్రాబాద్ రెవెన్యూ అధికారులు గురువారం సీజ్​చేశారు. సికింద్రాబాద్ తహసీల్దార్​పాండు నాయక్, డిప్యూటీ తహసీల్దార్​రజిని, గోపాలపురం సీఐ నరేశ్​యాక్షన్​లో పాల్గొన్నారు. తహసీల్దార్​పాండు నాయక్ మాట్లాడుతూ.. హోటల్​లోని 6 అంతస్తుల్లో మొత్తం 125 రూమ్స్​ఉన్నాయని చెప్పారు. మోటివేషనల్ స్పీకర్ మునావర్​జమా స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్​మెంట్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు 49 రూమ్స్​అక్టోబరు 1 నుంచి31 వరకు బుక్ చేసుకుని, వివిధ రాష్ట్రాలకు చెందిన 140 మందిని పిలిపించాడన్నారు. జమా రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే సలీం ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. 140 మందితో సమావేశాలు నిర్వహించినా, కనీసం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదని అందుకే హోటల్ సీజ్ చేసినట్లు తెలిపారు. 

మునావర్​జమా కోసం గాలింపు

పర్సనాలిటీ డెవలప్​మెంట్​పేరుతో వర్క్ షాప్ నిర్వహించి, ఒక వర్గానికి చెందిన వారిని తన ప్రసంగాలతో రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పిన ఇంగ్లీష్ అకాడమీ నిర్వాహకుడు మునావర్​జమా కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన జరిగిన రోజే మునావర్​జమాతోపాటు వర్క్ షాప్ కు హాజరైన వివిధ రాష్ట్రాలకు చెందిన 140 మంది పరారయ్యారు. వారి వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అనుమతులు తీసుకోకుండా మతపరమైన వర్క్ షాపులకు హోటల్ గదులను కేటాయించిన మెట్రో పోలిస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్ పై కూడా కేసు నమోదు చేసినట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు. కోర్టు అనుమతితో చర్యలు తీసుకుంటామన్నారు. గుడిలో విగ్రహం ధ్వంసమైన రోజే సలీం​హోటల్​గోడ దూకి పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారు. 

ఉపాధి కోల్పోయిన సిబ్బంది 

హోటల్ సీజ్​తో అందులో పనిచేస్తున్న దాదాపు 70 మంది రోడ్డున పడ్డారు. ఇప్పటికిప్పుడు సీజ్​చేస్తే వేరే ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఊర్లకు వెళ్దామన్నా  చేతిలో రూపాయి లేదని వాపోయారు. వేరే హోటల్​లో పని చేద్దామంటే ఖాళీలు లేవంటున్నారన్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళుతున్నట్లు ఒడిశాకు చెందిన మాలిక్​మీడియాకు తెలిపాడు.