- టెక్నికల్ సమస్యలతో ఎక్కడికక్కడ ఆగిపోయిన రైళ్లు
- కాలుష్యం వల్ల కరెంట్ సప్లైలో సమస్య వచ్చిందన్న మెట్రో అధికారులు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో మెట్రో సేవలు గంటపాటు నిలిచిపోయాయి. బుధవారం ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల సమయంలో ఎక్కడికక్కడ రైళ్లు ఆగిపోయాయి. నాగోల్, మియాపూర్ బ్లూలైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. అయితే, మెట్రో చరిత్రలో గంట పాటు సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా మెట్రోలో ఏ కారిడార్‌లో సమస్య వచ్చినా.. దాని ఎఫెక్ట్ మిగతా రెండు కారిడార్లపై కూడా పడుతుంది.
దీంతో మూడు కారిడార్లలో మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట తర్వాత సేవలు ప్రారంభమైనా.. కొన్ని గంటల పాటు రైళ్ల సర్వీసులు చాలా స్లోగా సాగాయి. వాతావరణంలో మార్పుల వల్లే మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో పొల్యూషన్ వల్ల మెట్రోకు పవర్ సప్లైలో అంతరాయం ఏర్పడి సమస్య వచ్చిందని వెల్లడించారు. ఉదయం 9.17 గంటల సమయంలో సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మెట్రో రైళ్లను ఉప్పల్ డిపోలోని ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్ నుంచి సీబీటీసీ టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేస్తుంటారు.
సాధారణంగా మెట్రోలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే పది పదిహేను నిమిషాల్లో పరిష్కారిస్తారు. అయితే, ఈసారి గంటపాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో అమీర్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్, మియాపూర్, జూబ్లీహిల్స్ తదితర స్టేషన్లు కిటకిటలాడాయి. కొన్నిచోట్ల ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది. మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో కొందరు ప్రయాణికులు బస్సుల్లో, ట్యాక్సీల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు.
తరచూ సాంకేతిక సమస్యలు...
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మెట్రోలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పీక్ అవర్స్‌లో సమస్యలు వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బుందులు పడుతున్నారు. గత నవంబర్‌లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతకు ముందు కూడా చాలా సార్లు టెక్నికల్ కారణాల వల్ల రైళ్లు ఆగిపోయాయి. తరుచూ సమస్యలు ఏర్పడుతుండటంతో మెట్రో అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.