తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో నగరంలో మెట్రో పరుగులకు అడుగులు పడుతున్నాయి. త్వరలోనే వరంగల్ మహాననగరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కాజీపేట నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకూ భూ, ఆకాశ మార్గంలో ఈ నియో మెట్రో రైలు ప్రయాణించనుంది. అందుకు తగ్గట్లుగా 15 కిలో మీటర్లు... 21 స్టేషన్లతో మహారాష్ట్రలోని నాసిక్నియో మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో మహామెట్రో సంస్థ రూపొందించిన డీపీఆర్, కేంద్ర సర్కార్ దగ్గరకు చేరుకుంది.
వరంగల్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే ప్రజల అవసరాలకు తగినట్లు సిటీలో రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. ఒకప్పుడు వరంగల్ లో 200 లోకల్ బస్సులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య సగానికి తగ్గింది. దీంతో ప్రజలు ఎక్కువగా ఆటోలు, సొంత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించాలని చాలా రోజుల నుంచి జనం కోరుతున్నారు. గత ఏడాదిగా మెట్రో రైల్ ప్రతిపాధనలు స్పీడప్ అయ్యాయి. దీనిపై ఇప్పటికే అనేక సార్లు రివ్యూలు జరిగాయి.
గత సంవత్సరం ఆఫీసర్లతో కలిసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు హెచ్ఎండీఏ అధికారులు. కాజీపేట రైల్వేస్టేషన్నుంచి పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్మీదుగా వవరంగల్ రైల్వే స్టేషన్ వరకు, అక్కడి నుంచి చౌరస్తా, జేపీఎన్రోడ్డు మీదుగా పోచమ్మ మైదానం వరకు ప్రధాన రహదారిని మెట్రో రైల్ ప్రతిపాధనల్లో తీసుకున్నారు.
మెట్రో నియో రైల్ ఏర్పాటుకు అర్బన్ మాస్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ , మహా మెట్రో , నాగపూర్ , హైదరాబాద్, పూణే టెక్నికల్ కమిటీ తయారు చేసిన డిపిఆర్ పై పాలకవర్గం, అప్పటి జిడబ్ల్యూఎసి కమిషనర్ సత్పతి ఫమేలా ఆధ్వర్యంలో మీటింగ్ లు నిర్వహించారు. టెక్నికల్ టీం ఆయా శాఖల అధికారుల నుంచి ఇన్పుట్స్ సేకరించి, సాధ్య సాధ్యాలపై దృష్టిపెట్టారు. ఆ తర్వాత కొన్ని మార్పులు చేస్తూ మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ సంస్థ తరహాలో డిటైల్డ్ ప్రాజెక్ట్రిపోర్ట్ ను తయారు చేశారు. గతంలో 15 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని హైదరాబాద్ తరహాలో ఆకాశమార్గంలో నిర్మించాలని ప్రతిపాదించారు. తాజాగా మరికొన్ని మార్పులతో నాసిక్, నాగ్ పూర్ తరహాలో కొత్త డీపీఆర్ తయారు చేశారు. కొత్త విధానంలో నిర్మాణ వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది.
ఏడు కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో, మరో 8 కిలోమీటర్లు. ఆకాశమార్గంలో మెట్రో రైలు రన్ చేసేలా డీపీఆర్ సిద్దం చేశారు. మహా మెట్రో సంస్థ తయారు చేసిన నియో వరంగల్ కొత్త డీపీఆర్ కాకతీయ అర్బన్డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చినెలలో అందచేసింది. ఇటీవలే దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. వరంగల్ మెంట్రో కు నాసిక్ నియో మెట్రో రైలు ప్రాజెక్ట్తరహాలోనే డీపీఆర్ ను తయారు చేశారని, 21 స్టేషన్లు ఉంటాయని చెబుతున్నారు కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి.
నియో మెట్రో వరంగల్ ప్రాజెక్టుకు 1,012 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సాధారణ విధానంలో అయితే కిలోమీటరు నిర్మాణానికి.180 కోట్ల ఖర్చు అవుతుండగా.. తాజా డీపీఆర్ ప్ర్రకారం కిలోమీటర్ కు 60 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరంగల్ మహానగర జనాభా పది లక్షలు. 20 ఏళ్లకు అంటే 2041కి జనాభా 20 లక్షలవుతుందని అంచనా. 20- 30 లక్షల జనాభా ఉండే మధ్య తరహా నగరాలకు నాసిక్ ప్రతిపాదించిన నియో మెట్రో విధానం చక్కగా సరిపోతుందని భావిస్తున్నారు.
నియో మెట్రో సాంకేతికతలో ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తారు. రబ్బర్ టైర్లపై నడవడం దీని ప్రత్యేకత. వరంగల్ రోడ్లు కొత్త మెట్రోకు సరిపోతాయని ఈ తరహా మెట్రోను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో మూడోవంతు ప్లాట్ఫాంలు మాత్రమే షెడ్లుగా ఉండనున్నాయి. ఫలితంగా నిర్మాణ, విద్యుత్తు వ్యయం భారీగా ఆదా అవుతుంది. ఆటోమేటింక్ టికెటింగ్ విధానంతో నిర్వహణ ఖర్చు కూడా తగ్గనుంది. సాధారణ విధానంలో అయితే మెట్రో నిర్వహణ కోసం కిలోమీటర్ కు 35 మంది సిబ్బంంది అవసరం ఉంటుంది. కొత్త విధానంలో నియో మెట్రోకు 15 మంది సరిపోతారని ప్రాజెక్టు రిపోర్ట్ లో తెలిపారు.
మెట్రో ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో పాటు పరిశ్రమల అభివృద్దికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రైలు, రోడ్డు మార్గాలు ఉన్న వరంగల్ కు మామునూరు ఎయిర్ పోర్ట్, మెట్రో అందుబాటులోకి వస్తే పారిశ్రామికంగా, టూరిజం పరంగా డెవలప్ జరుగుతుందని అంటున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు ను స్వాగతిస్తూనే .. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు కొందరు. వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాలేదు.చిన్నపాటి వర్షం వస్తేనే నగరంలో చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయని ...సిటీలో మౌళిక సదుపాయాలు కల్పించిన తర్వాత మెట్రో లాంటి భారీ ప్రాజెక్టులు చేపడితే బాగుటుందంటున్నారు జనం.
మొదటి దశలో కాజీపేట నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకూ... రెండో దశలో మడికొండ నుంచి ఖమ్మం హైవే మామునూరు, కరీంనగర్ వైపు , నర్సంపేట మార్గంలో ధర్మారం వరకూ మెట్రో విస్తరించాలని ప్రాజెక్టు ప్రతిపాధనలో ఉంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే వరంగల్ రూపురేఖలు మారనున్నాయి.