
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి సమస్యలు మొదలయ్యాలం టూ కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మెట్రోవాటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది కొన్ని చోట్ల భూగర్భ జలాలు అడుగంటడం, నగర పరిధి రోజురోజుకూ విస్తరించడంతో నీటి డిమాండ్పెరుగుతోందన్నారు. అయినా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా నీటి సరఫరా జరుగుతోందన్నారు.
2021–22 వరకూ ట్యాంకర్ల డిమాండ్ 32 శాతం పెరగగా, 2022–23లో 19 శాతం, 2023–24 లో 31 శాతం, 2024–25 ఫిబ్రవరి నాటికి 37 శాతం డిమాండ్ పెరిగిందన్నారు. అయినప్పటికీ డిమాండ్‌కు తగ్గట్టుగా నగరంలో ఫిల్లింగ్స్టేషన్లు, ఫిల్లింగ్పాయింట్లను పెంచుతున్నామన్నారు. 2024 జనవరి నాటికి నగరంలో 69 ఫిల్లింగ్ స్టేషన్లు ఉంటే ఈ ఏడాది మరో 10 ఫిల్లింగ్స్టేషన్లు పెంచామని, గతేడాది ఫిల్లింగ్పాయింట్లు 93 ఉంటే ఈసారి 123కు పెంచామన్నారు. ట్యాంకర్ల విషయానికి వస్తే 2024లో 577 ఉండగా, ఇప్పుడు 907కు పెంచామన్నారు.