పనికిరాని బోర్లు ఇక ఇంకుడుగుంతలు

పనికిరాని బోర్లు ఇక ఇంకుడుగుంతలు
  • నిరుపయోగ చేతి పంపులపై మెట్రో వాటర్​బోర్డు దృష్టి
  • గ్రేటర్​లో పాడై పోయిన 3,222 బోర్లను గుర్తించిన సంస్థ  
  • ఇంజెక్షన్ బోర్​వెల్స్​గా మార్చి భూగర్భ జలాలు పెంచే ప్లాన్​ 
  • బల్దియా సహకారంతో పనులు

హైదరాబాద్​సిటీ, వెలుగు:గ్రేటర్లో అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచేందుకు మెట్రో వాటర్​బోర్డు అధికారులు 90 రోజుల ప్రణాళిక పేరుతో జంట నగరాల్లో స్పెషల్​డ్రైవ్​నిర్వహిస్తున్నారు. తాజాగా వివిధ ప్రాంతాల్లో పనికి రాకుండా ఉన్న హ్యాండ్​బోర్ వెల్స్(చేతి పంపులు) ను ఇంజక్షన్​(బోర్) వెల్​పద్ధతిలో ఇంకుడు గుంతలుగా మార్చాలని ప్రణాళికలు రూపొందించారు. 

గత వేసవిలో గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో తాగునీటితోపాటు గృహావసరాలకు కూడా అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. భవిష్యత్​లో అలా కాకూడదన్న ఉద్దేశంతో ఉన్నతాధికారులు పక్కా ప్లాన్​తో ముందుకు పోతున్నారు.

10 నుంచి 20 మీటర్ల లోతులో...

ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేవని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా కోర్​సిటీలో అంటే ఓల్డ్​సిటీ, నాంపల్లి, అబిడ్స్, సికింద్రా బాద్​ తదితర ప్రాంతాల్లో 10 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా..హైటెక్​​సిటీ, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్​ తదితర ప్రాంతాల్లో 20 మీటర్ల లోపల నీటి నిల్వలున్నట్టు మెట్రో వాటర్​బోర్డు రెయిన్​వాటర్​హార్వెస్టింగ్​విభాగం ఆఫీసర్​ జాలా సత్యనారాయణ తెలిపారు. 

అందుకే భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గ్రేటర్​పరిధిలో 3,222 బోర్‌‌ వెల్స్‌‌ నిరుపయోగంగా ఉన్నాయని గుర్తించారు. ఇందులో కోర్‌‌సిటీలో 1665, శివార్లలో 1557 బోర్లున్నట్లు తేల్చారు. బల్దియా సహకారంతో ఈ బోర్​వెల్స్​ను ఇంజక్షన్​(బోర్)​వెల్స్​గా మార్చనున్నారు.  

ఇంజక్షన్‌‌ (బోర్‌‌)వెల్స్​అంటే..  

నిరుపయోగంగా ఉన్న బోర్​వెల్ ను అడుగు మేర ఎత్తి సైజును బట్టి చుట్టూ చతురస్రాకారంలో గోడ కడతారు. బోర్​వెల్​ను రెండు మీటర్లు పైకి లేపి కేసింగ్​పైపు చుట్టూ రంధ్రాలు చేస్తారు. తర్వాత స్టీల్​మెష్​చుడతారు. దాని చుట్టూ 50 శాతం మేరకు దొడ్డు కంకర (40ఎంఎం) పోస్తారు. మరో 25 శాతం చిన్న కంకర( 20ఎంఎం) నింపుతారు.

తర్వాత 9 అంగుళాల నుంచి ఒక అడుగు మేర దొడ్డు ఇసుక ఒక పొర పోసిన తర్వాత దానిపై జియో టెక్స్ టైల్​మ్యాట్​ను పరిచి మళ్లీ దానిపై ఇసుక పోస్తారు. వర్షపు నీరు నేరుగా ఇందులోకి వెళ్లేలా చూస్తారు. వర్షపు నీరు ఇసుక మీదుగా పారుతూ ఫిల్టర్​అవుతూ కిందకు కేసింగ్​పైపు నుంచి లోపలకు వెళ్తుంది. లోపలున్న రంధ్రాల ద్వారా భూమి చుట్టూ విస్తరించి భూగర్భ జలాలు పెరగడానికి కారణమవుతుంది. 

వాన నీటిని సంరక్షించుకోవాలి

వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలు పెంచుకోవాలని నిరుపయోగంగా ఉన్న బోర్​వెల్స్​ను ఇంకుడు గుంతలుగా మారుస్తున్నాం. దీని కోసం పనికి రాని 3,222 బోర్లను గుర్తించాం. వీటిని ఇంజక్షన్‌‌ బోరువెల్స్​గా మార్చి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. దీనివల్ల నీటి సమస్య కొంతవరకు తగ్గుతుంది. నగరవాసులందరూ సహ‌‌కరించాలి. 

- ఎండీ అశోక్‌‌ రెడ్డి