ఓఆర్ఆర్​ పరిధిలో ఎస్టీపీల కోసం స్థలాల వేట

ఓఆర్ఆర్​ పరిధిలో ఎస్టీపీల కోసం స్థలాల వేట
  • తెల్లాపూర్​లో వనం చెరువు దగ్గర జాగా పరిశీలించిన వాటర్​బోర్డు ఎండీ  
  • రూ.3849 కోట్లతో 39 కొత్త ఎస్టీపీల  నిర్మాణానికి వాటర్​బోర్డు సన్నాహాలు
  • అమృత్​పథం కింద రూ.3,849 కోట్లు మంజూరు
  • మూసీ ప్రక్షాళనలో భాగంగానే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఔటర్​ రింగ్​రోడ్​ పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు మెట్రో వాటర్​ బోర్డు సిద్ధమవుతోంది. దీని కోసం అధికారులు స్థలాల వేట మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పటాన్​చెరులోని తెల్లాపూర్​లో ఎస్టీపీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు బోర్డు ఎండీ అశోక్​రెడ్డి ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలతో కలిసి పర్యటించారు.

31 ఎంఎల్ డీల కెపాసిటీతో నిర్మించతలపెట్టిన ఎస్టీపీ స్థలం కోసం మేళ్ల చెరువు, వనం చెరువు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. మేళ్లచెరువు వద్ద సరిపడా స్థలం లేకపోవడంతో వనం చెరువు దగ్గర స్థలాన్ని గుర్తించారు. వారికి ఎస్టీపీ నిర్మాణం వల్ల జరిగే లాభాల్ని వివరించడంతో ఎస్టీపీ నిర్మాణానికి సహకారం అందిస్తామని ప్రకటించారు.  

కొత్తగా 39 ఎస్టీపీల నిర్మాణం
గ్రేటర్​ లో ఇప్పటికే రూ. 3866.41 కోట్లతో 38 ఎస్టీపీల నిర్మాణ పనులు మొదలుపెట్టిన వాటర్​బోర్డు పనులను దాదాపు పూర్తి చేసింది. ప్రభుత్వం బల్దియా పరిధిని ఓఆర్ఆర్​ వరకూ విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో అర్బన్​ లోకల్ బాడీ (యుఎల్ బీ) కింద ఓఆర్ఆర్​ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో మరో 39 ఎస్టీపీలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే అమృత్​పథకంలో భాగంగా రూ.3,849 కోట్లు కేటాయించింది. ఒక ఎస్టీపీని పబ్లిక్​ ప్రైవేట్​ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో నిర్మించనుండగా, మరో 38 ఎస్టీపీలను హైబ్రిడ్​ హామిట్​మోడ్​(హెచ్​ఏఎం) పద్ధతిలో నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు.

మూసీలోకి శుభ్రమైన నీరు 
ఓఆర్ఆర్​పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో నిర్మించే 39 ఎస్టీపీల్లో మురుగునీటిని శుద్ధి చేసి వాటిని నేరుగా మూసీలో కలపనున్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగానే ఈ ఎస్టీపీల నిర్మాణం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా నిర్మించాలని ప్రతిపాదించారు. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలు, ప్యాకేజ్​–2లో 22 ఎస్టీపీలు కడతారు. దీని వల్ల రోజుకు దాదాపు 972 ఎంఎల్​డీల మురుగునీటిని శుద్ధి చేసే అవకాశం ఉంటుంది.

స్థానిక సంస్థల పరిధిలోనూ ఎస్టీపీలను నిర్మించడం ద్వారా మూసీనదిలోకి వచ్చే మురుగునీటిని అరికట్టి శుభ్రమైన నీటిని నదిలోకి వదలాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజుకు 1950 ఎంఎల్‌డీల మురుగు నీరు వస్తోంది. బల్దియా ప్రాంతంలో 1650 ఎంఎల్‌డీలు ఉత్పత్తి అవుతుండగా, ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్‌డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేస్తున్నారు. ఈ కొత్త ఎస్టీపీలు పూర్తయితే గ్రేటర్ ​హైదరాబాద్​ పరిధిలో వందశాతం మురుగునీటిని శుద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.