దక్షిణ కాశీ… వరంగల్ జిల్లాలోని మెట్టుగుట్ట

ఎత్తైన పర్వత శిఖరం.. సుమారు 55 ఎకరాల్లో విస్తరించిన గుట్ట పైభాగం. అక్కడే కొలువైన రామలింగేశ్వరస్వామి. వరంగల్ జిల్లా కాజీపేట – హైదరాబాద్ రహదారి మడికొండలోని మెట్టు గుట్టపై ఉంది ఈ ఆలయం. కాకతీయులు నిర్మించిన ఈ ఆలయ గుట్టను పూర్వం ‘మణిగిరి’గా పిలిచేవారు. క్రమంగా మెట్టు గుట్టగా మారింది. శివకేశవులతో పాటు వీరభద్రస్వామి, గణపతి, ఆంజనేయుడు, సంతాన వేణుగోపాల స్వామి, అన్నపూర్ణ ఆలయాలతో దక్షిణకాశీగా విలసిల్లుతోంది.

‘గతంలో మునులు, సిద్ధులు, సాధువులు..శివుడిని దర్శించుకుని ప్రసన్నం చేసుకున్నారు. కరువు కాటకాలు, వ్యాధులతో బాధపడుతున్న ప్రజలను కాపాడటంతో పాటువాళ్లలో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి భూలోకంలో అవతరించమని శివుడిని ప్రార్థించారు. దాంతో పరమశివుడు ఇక్కడికి సమీప ప్రాంతంలో స్వయంభూ లింగంగావెలిశాడు. తర్వాత కొంతకాలానికి సిద్ధులుతపస్సు చేయగా పరమశివుడు అన్నపూర్ణగావెలిశాడు. శ్రీరాముడు వనవాసం చేస్తూ మెట్టు గుట్ట వద్ద శివుడికి ప్రత్యేక అభిషేకాలుచేశాడు. అప్పటి నుంచి ఈ ఆలయం శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి దేవాలయం’గా పేరొందిందని స్థానికులు చెబుతున్నారు.‘1925లో అభినవ పోతన వానమామలై వరదాచార్యులు మండలం పాటు గుట్టపై వాగీశ్వర మంత్రోపాసన చేయగా సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు భక్తులు సరస్వతీదేవి ఆలయం నిర్మించాలని నిర్ణయించినట్టు ’చెబుతారు స్థానికులు.

చారిత్రక ప్రాధాన్యం
క్రీస్తుశకం 950లో మణిగిరి (మడికొండ) గ్రామాన్ని వేంగి దేశ చాళుక్య రాజు పెద్దకొడుకు సుకుమాయుదుడు పరిపాలించినట్టు ‘కొరివి’ శాసనాల ద్వారా తెలుస్తోంది. చాళుక్య రాజుల అనంతరం మణిగిరి ప్రాంతం కాకతీయ రాజుల వశమైంది.ఈ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. నాడు ఓరుగల్లును పరిపాలిస్తున్న కాకతీయ ప్రభువువైన రెండవ ప్రోలరాజు సహకారంతో క్రీస్తుశకం 1000–1158 మధ్యకాలంలో రామాలయాన్ని నిర్మించినట్టు ఆధారాలున్నాయి. క్రీస్తుశకం 1198–1261మధ్య కాలంలో ఓరుగల్లును పాలించిన గణపతిదేవ చక్రవర్తి ఈ కొండపై ఉన్న రామాలయంలో విగ్రహాలు నెలకొల్పడంతో పాటు శివాలయం నిర్మించాడు. శివాలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన శివలింగం కాశీలోని స్వయంభూలింగాన్ని పోలి ఉంటుంది. గోల్కొండ నవాబుల కాలంలో సుబేదారుగాఉన్న సితాబుఖాన్ శివాలయానికి నాలుగుఎకరాలు, రామాలయానికి 36 ఎకరాలు ‘తరి’, 412 ఎకరాల ‘ఖుష్కి ’ ఇనాముగా ప్రకటించినట్టు శాసనం ఉంది.

165 అడుగుల ఎత్తు లో శిఖరాలు
మెట్టు గుట్టపై 165 అడుగుల ఎత్తులో రెండుజంట శిఖరాలున్నాయి. ఒక శిఖరంలో ఐదు, మరొక శిఖరంలో నాలుగు చొప్పున పెద్దపెద్ద శిలలు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు కనిపిస్తాయి.మెట్టు గుట్టపై కార్తీకమాసంలో వరలక్ష్మిపూజలు, దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ‘శివకల్యాణం’, శ్రీరామ నవమి రోజున ‘సీతారామకల్యాణం’ వైభవంగా నిర్వహిస్తారు.

మెట్టు గుట్టపై నవగుండాలు
మెట్టు గుట్టపై తొమ్మిది గుండాలు ఉన్నాయి.ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈనవగుండాల్లో పాలగుండం, జీడిగుండం, బ్రహ్మగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం ప్రసిద్ధమైనవి. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపనాశనిగా భక్తులు భావిస్తారు. దీనిలో పాతాళ ఊట ఉంటుందని చెబుతారు. జీడిగుండం పక్కనే భీముని పాదముద్రలు కనిపిస్తాయి. ఇదిలా ఉండగా, మెట్టు గుట్టపై అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భక్తులవిరాళాలతో శారదాంబ (సరస్వతీ దేవి) ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అలాగే నిత్యాన్నదానసత్రం, అద్దాల మండపం, వీరభద్రస్వామి ఆలయ పనులు జరుగుతున్నాయి.