
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫైర్ అయ్యాడు. శనివారం (ఏప్రిల్ 19) ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ప్రతిసారి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దిగిపో దిగిపో అంటున్నాడు. కానీ దిగిపోడానికి ఇది మీరు ఇచ్చిన అధికారం కాదు.. ప్రజలు ఇచ్చిన పవర్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, దళితలను ఇలా అన్నీ వర్గాలను మోసం చేసినప్పుడే కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి దిగిపోమన్ని కేటీఆర్ చెప్పాల్సిందన్నారు.
తండ్రి దిగిపోగానే కొడుకు ఎక్కడానికి ఇదేమి కారుణ్య నియామకం కాదని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ అరాచకాలు, దుర్మార్గలు, మీ కుటుంబ పాలన భరించలేకే ప్రజలు మిమ్మల్ని దింపేశారని విమర్శించారు. ఇక కేసీఆర్, బీఆర్ఎస్ ఏమి చేయలేదని నమ్మే ప్రజలు కాంగ్రెస్‌కి అధికారం ఇచ్చారన్నారు. ఇంకో 20 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి కాలి గోటికి కూడా సరిపోడని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికైనా హరీష్ రావు అధ్యక్షుడు అవుతాడని కేటీఆర్‌కి భయం పట్టుకుందని హాట్ కామెంట్స్ చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి అనే పేరు బీఆర్ఎస్ నాయకులకు చాలా ఏండ్లు యాది ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ఒక శక్తి.. రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదని.. కల్వ కుట్రల ఫ్యామిలీ అని విమర్శించారు. కేటీఆర్ ముందు నీ స్టడీ సర్టిఫికెట్స్ తీసుకొని రా అప్పుడు నువ్వు తెలంగాణ వాసివో కాదో చూద్దామని అన్నారు.