యూఎస్, దాని సరిహద్దు దేశాల మధ్య టారిఫ్ యుద్ధం నడుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో వివిధ సందర్భాల్లో కెనడా, మెక్సికో, చైనా తదితర దేశాలపై టారిఫ్ లు విధిస్తామని పదే పదే చెప్పిన ట్రంప్.. అన్నట్లుగానే టారిఫ్ విధిస్తూ ఎక్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకాలు చేశారు. కెనెడా, మెక్సికోలపై 25%, చైనా పైన 10% టారిఫ్ విధుస్తూ తాజాగా సంతకాలు చేయడం సంచలనంగా మారింది. పెంచిన టారిఫ్ లు ఫిబ్రవరి 4 నుంచి అమలు కానున్నాయి. అయితే కెనడా నుంచి వచ్చే విద్యుత్ శక్తికి సంబంధించిన వస్తులపై కాస్త ఊరటనిస్తూ 10% సుంకం విధించారు.
దెబ్బకు దెబ్బ.. అంతే స్థాయిలో ప్రతిఘటించిన మెక్సికో, కెనడా..
యూఎస్ టారిఫ్ విధింపులపై కెనడా, మెక్సికో దేశాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. అక్కడ ట్రంప్ అయితే ఏంటి.. తమ తడాఖా ఏంటో చూపిస్తాం అన్నట్లుగా వెంటనే అమెరికాపై టారిఫ్ లను పెంచుతున్నట్లు ప్రకటించాయి కెనడా, మెక్సికో దేశాలు. ఈ నిర్ణయంతో యూఎస్ తో ట్రేడ్ వార్ కు సిద్ధం అనే సంకేతాలిచ్చాయి. ఈ సందర్భంగా మెక్సికో ప్రసిడెంట్ క్లాడియా షేన్ బామ్ యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. తమ ప్రజల ప్రాధాన్యతలను కాపాడుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ట్రంప్ ఆరోపణలను కొట్టిపారేశారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ట్రంప్ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. అంతే స్థాయిలో యూఎస్ పై టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్ ల వల్ల అమెరికా ప్రజలే ఎక్కువ పర్యావసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 155 బిలియన్ డాలర్ల అమెరికా వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రపంచ వాణిజ్య సంస్థలో తేల్చుకోనున్న చైనా:
ట్రంప్ నిర్ణయాన్ని చైనా కూడా సీరియస్ గా తీసుకుంది. దీనిపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో తేల్చుకోనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. యూఎస్ నిర్ణయం వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.
ట్రంప్ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు, ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం?
ట్రంప్ తాజా నిర్ణయం ఇరు దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అమెరికా దిగుమతులు ఎక్కువగా కెనడా, మెక్సికో, చైనా దేశాల నుంచే ఉంటాయి. దీంతో ఈ మూడు దేశాలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడనుందని చెబుతున్నారు. ట్రంప్ తాజా నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నిర్ణయం ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారనుందని అంటున్నారు. అదే విధంగా ద్రవ్యోల్బణం ఎదురయ్యే అవకాశం ఉందని యేటే యూనివర్సిటీ ఎకనమిస్టులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి యూఎస్ పౌరుడు ఆదాయంలో సరాసరిగా 1170 డాలర్లు నష్టపోనున్నట్లు తెలిపారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం కాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.