
- గతంలో అందుబాటులో 1200 వరకు యూనిట్లు.. ఇప్పుడు 422కు పడిపోయిన వైనం
- ఈ బ్లడ్ బ్యాంక్‍పైనే ఆధారపడ్డ ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రులు
- ప్రైవేట్‌లో డబ్బులు గుమ్మరిస్తేనే రక్తం
- వేసవిలో బ్లడ్ కోసం పేషెంట్ల ఇబ్బందులు
- రక్తదానానికి తగ్గిన మోటివేటివ్ ప్రోగ్రామ్స్
వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉండే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో నిల్వలు తగ్గాయి. నిన్నమొన్నటి వరకు రక్తం కోసం ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ఇక్కడకి వచ్చినా ఉచితంగా అందించిన ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ఇప్పుడు ఇప్పడు బయటి వ్యక్తులకు ఇవ్వడం ఆపేసింది. అదే ఆస్పత్రిలోని బాధితులకు అవసరమైన రక్తాన్ని కూడా అందించలేని స్థితికి రావడం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో ఇక్కడ రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించడం, క్యాంపులు ఏర్పాటు చేసేలా మోటివేట్ చేసేవారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ఇక్కడ రక్తపు నిల్వలు తగ్గాయి. ఆపరేషన్లు చేయాల్సిన ఎమర్జెన్సీ టైంలో బాధితుల కుటుంబ సభ్యులు రక్తం కోసం సిటీ అంతటా తిరుగుతున్నారు. అధికారులు ముందస్తుగా మేల్కోనకపోతే ఏప్రిల్, మే, జూన్నెలల్లో తీవ్ర ఇబ్బంది నెలకొననుంది.
బ్లడ్‌కు ఎంజీఎం ఆధారం..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‍పై గ్రేటర్ వరంగల్‌లోని ఐదారు సర్కారు ఆస్పత్రుల పేషెంట్లు ఆధారపడి ఉన్నారు. ప్రధానంగా ఎంజీఎంతోపాటు కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వరంగల్, హనుమకొండలోని సీకేఎం, జీఎంహెచ్ ప్రసవ ఆస్పత్రులు, ఐ హాస్పటల్స్‌కు చెందిన వేలాది మంది పేషెంట్లు ఎమర్జెన్సీ సమయంలో ఎంజీఎం బ్లడ్ బ్యాంకు నుంచే ఉచితంగా రక్తం పొందుతారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన తలసేమియా బాధితులు ఈ బ్లడ్ బ్యాంకుకే రక్తం కోసం వస్తున్నారు. యావరేజీగా ఇక్కడ 1000 నుంచి 1200 బ్లడ్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. దాదాపు అదేస్థాయిలో బ్లడ్ యూనిట్ల అవసరం ఉంటుంది. కాగా, ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో గత బుధవారానికి 422 యూనిట్లకు తగ్గింది.
తగ్గిన మోటివేషనల్ ప్రోగ్రామ్స్..
గతంలో ఎంజీఎం బ్యాంకు తరఫున బ్లడ్ మోటివేటర్ ఉండి, రెగ్యూలర్‍గా రక్తదాన శిబిరాలు ప్రొత్సహించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో అధికారులు స్వచ్చంద సంస్థలు, రక్తదాతల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఎంజీఎంలోనూ రక్తం దొరకకపోవడంతో, ఒక్కసారిగా రక్తపు నిలువలు తగ్గి అత్యవసర ఆపరేషన్లు అవసరమైన రోగులు ఇబ్బందులు పడ్తున్నారు. పేషెంట్లకు బ్లడ్ కావాలంటే వారి తరఫున ఎవరైనా రక్తం ఇవ్వాలని చెప్పడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇబ్బందులు పడక తప్పడం లేదు.
ఈ క్రమంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు వెళ్లి డబ్బులు గుమ్మరించాల్సి వస్తోంది. అక్కడ ఒక్కో యూనిట్‍కు ఎమర్జెన్సీ అయితే రూ.2 వేల నుంచి రూ.5 వేలు ఖర్చు చేస్తున్నారు. ప్రైవేట్ బ్లడ్ దందాకు కొందరు ఎంజీఎం సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి.
యూనిట్లు తగ్గినయ్.. దాతలు సహకరించాలే..
ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో గతంలో 1200 వరకు ఉండే యూనిట్లు 422కు తగ్గాయి. వేసవి కాలంలో నేపథ్యంలో రక్తదాన శిబిరాలు తగ్గాయి. అవసరంమేరకు ఇప్పుడు రక్తం అందుబాటులో అయితే లేదనేది వాస్తవమే. ఎమర్జెన్సీ తీవ్రత ఆధారంగా ఫ్రీ యూనిట్లు ఇస్తున్నాం. రాబోయే మూడు నెలలు మరింత ఇబ్బంది ఉంటుంది. బ్లడ్ క్యాంపులు పెట్టేందుకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ముందుకురావాలి. డాక్టర్ ఆశా, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్