
- లోక్‌సభ వెల్‌లోకి వెళ్లి టీఎంసీ, డీఎంకే ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: బెంగాల్‌కు ఇచ్చిన ఉపాధి హామీ నిధులు మిస్ యూజ్ అవుతున్నాయని.. ఇందుకు అనేక ఆధారాలున్నాయని కేంద్రం లోక్‌సభలో పేర్కొన్నది. ఆ రాష్ట్రంలో పనులను ఇష్టారీతిన విభజించి కాంట్రాక్టుఇచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయని తెలిపింది. అలాగే తమిళనాడు రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్(యూపీ) కంటే ఎక్కవ ఉపాధి హామీ నిధులు ఇచ్చామని చెప్పింది. దీంతో టీఎంసీ, డీఎంకే పార్టీల ఎంపీలు వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను15 నిమిషాలు వాయిదా వేశారు. మంగళవారం క్వశ్చన్ అవర్ సందర్భంగా ఉపాధి హామీ కార్యక్రమంపై వివిధ రాష్ట్రాలు ఎంపీలు లోక్‌సభలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్సమాధానం చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ఉపాధి హామీ నిధులు బెంగాల్లో మిస్యూజ్ అయ్యాయని పేర్కొన్నారు. పనులను విభజించి, నామినేటెడ్ ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ‘‘మేము పంపిన ఆడిట్ టీమ్ బెంగాల్లో 44 పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. 34 పనుల్లో రికవరీ చేశారు.
మరో 10 పనుల మొత్తం రికవరీ కావాల్సి ఉంది” అని మంత్రి చెప్పారు. అలాగే, తమిళనాడుకు యూపీ కంటే ఎక్కువగా ఉపాధి నిధులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో రాష్ట్రాలపై వివక్ష చూపడం లేదనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ అన్నారు.
దీనిపై డీఎంకే ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీ కనిమెళి మాట్లాడుతూ ఉపాధి హామీ కార్యక్రమం డిమాండ్ ఆధారితమన్నారు. తమిళనాడుకు రూ. 4,034 కోట్ల ఉపాధి నిధులు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కూలీలసు చెల్లింపులు 15 రోజులకు పైగా ఆలస్యమైతే, వారికి 0.05 వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.