
- నిరసనలకు పిలుపునిచ్చిన ఎస్ఆర్డీఎస్ రాష్ట్ర జేఏసీ
- రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, డీఆర్డీఓలకు వినతి పత్రాలు
- 3 నెలలుగా జీతాలు రావట్లేదంటూ పలువురి ఆవేదన
- సుమారు 12,300 మందికి అందకపోవడంతో ఇబ్బందులు
హైదరాబాద్/మెదక్, వెలుగు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) ఉద్యోగులకు, సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆందోళన బాటపట్టారు. ఇటీవల పెండింగ్వేతనాల కోసం ఎస్ఆర్డీఎస్రాష్ట్ర జేఏసీ నేతలు పీఆర్, ఆర్డీ డైరెక్టర్సృజనను కలిసి విన్నవించారు. ఫలితం లేకపోవడంతో మే 4 వరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా మంగళ వారం ఎస్ఆర్డీఎస్రాష్ట్ర జేఏసీ నేతలు పలు జిల్లాల్లో డీఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేశా రు. బుధవారం జిల్లా, మండల ఆఫీసుల్లో ఎంసీసీలో పెన్ డౌన్ చేయనున్నారు. గురువారం పెన్ డౌన్, షట్ డౌన్ సహాయ నిరాకరణ, శుక్రవారం ప్రజాభవన్, సీఆర్డీ ఆఫీసుకు వెళ్లి శాంతియుతంగా నిరసన తెలపనున్నారు. శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.
పనులు ఎక్కువ.. ఫలితం తక్కువ
రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఉపాధి హామీ కింద 7,471 మంది ఫీల్డ్అసిస్టెంట్లు, 400 మంది ఏపీవోలు, 2,150 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 850 మంది కంప్యూటర్, అకౌంట్స్ ఆపరేటర్లు, 346 మంది ఈసీలు, 540 మంది అటెండర్లు .. మొత్తంగా సుమారు12,300 మంది పని చేస్తున్నారు. ఉపాధి కూలీలతో పనులు చేయించడం, సకాలంలో జీతాలు అందించడం.. తదితర విధుల్లో పాల్గొంటున్నారు. ఉపాధి పనులను క్రమం తప్పకుండా చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు నిధులు తేవడంలో వీరిది కీలకపాత్రగా ఉంది.
మెటీరియల్ కాంపోనెంట్ నిధుల కింద 2,150 మంది టీఏలకు నెలనెలా శాలరీలు అందుతున్నాయి. మిగతా వారికి ఫిబ్రవరి నుంచి, ఫీల్డ్అసిస్టెంట్లకు జనవరి నుంచి జీతాలు రావడంలేదు. జిల్లా, మండల ఆఫీసుల్లోని సిబ్బంది, ఉద్యోగులకు 3 నెలలుగా రాకపోగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రెగ్యులర్ఉద్యోగుల మాదిరిగా పనులు చేస్తున్నా.. ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఏడాదిగా మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయి. గత జనవరి నుంచి ఇప్పటి వరకు రాలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులకు.. ఈఎంఐలకు చెల్లించలేక అప్పులు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్వేతనాలు విడుదల చేయాలి. ఉద్యోగులకు పే స్కేల్ఇవ్వాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం.
ఎస్ఆర్డీఎస్ రాష్ట్ర జేఏసీ కో- చైర్మన్లు తంగెళ్ల రఘు, వెంకటరామిరెడ్డి