కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పహల్గాం ఉగ్రదాడి కేసు విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం టెర్రర్ ఎటాక్ కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం (ఏప్రిల్ 26) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ పర్యవేక్షిస్తోందని పేర్కొంది. 

సెంట్రల్ హోం మినిస్ట్రీ ఆదేశాలతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. పహల్గామ్ దాడికి సంబంధించిన కేసు డైరీ, ఎఫ్ఐఆర్‎ను స్థానిక పోలీసుల నుంచి తీసుకుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్లిన ఎన్ఐఏ టీమ్.. ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. ఎన్ఐఏ ఫోరెన్సిక్ బృందం ఘటన స్థలంలో సాక్ష్యధారాలను సేకరించింది.

కాగా, జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం బెసరన్ మైదాన ప్రాంతంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది టూరిస్టులు హతమయ్యారు. పహల్గాం టెర్రర్ ఎటాక్ ను కేంద్ర ప్రభుత్వం సీరియస్‎గా తీసుకుంది. 

పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రమూకల వెనక పాక్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన భారత్.. దాయాది దేశంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్‎కు తగిన బుద్ధి చెప్పాలని.. సింధు నది జలాల ఒప్పందం రద్దు వంటి కఠిన ఆంక్షలు విధించడంతో పాటు.. ఆ దేశంతో దౌత్య, వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెంచేసుకుంది.