మే 12 నుంచి ట్రైన్స్ స్టార్ట్: రైలు ప్ర‌యాణాల‌కు కేంద్ర హోం శాఖ‌ మార్గ‌ద‌ర్శ‌కాలు

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన రైలు ప్ర‌యాణాలు దాదాపు నెల‌న్న‌ర రోజుల త‌ర్వాత‌ మ‌ళ్లీ మొద‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టికే వ‌ల‌స కార్మికులను సొంత ఊర్ల‌కు చేర్చేందుకు శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్స్ న‌డుపుతున్న రైల్వే శాఖ.. మే 12 నుంచి సాధార‌ణ ప్ర‌యాణికుల కోసం కూడా రైళ్లు స్టార్ట్ చేస్తోంది. ప్ర‌స్తుతం న్యూఢిల్లీ నుంచి 15 మేజ‌ర్ సిటీల‌కు ట్రైన్స్ న‌డ‌ప‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ రైళ్ల‌కు రిజ‌ర్వేష‌న్ ను సోమ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల నుంచి చేసుకోవ‌చ్చని తెలిపింది. అయితే క‌రోనా బారిన‌ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ఈ ప్రయాణాలు జ‌రిగేలా కేంద్ర హోం శాఖ స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొటోకాల్ ను జారీ చేసింది. ప్ర‌యాణికులు, రైల్వే శాఖకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సోమ‌వారం జారీ చేసింది.

మార్గ‌ద‌ర్శ‌కాలివే:

– కేంద్ర హోం శాఖ‌, ఆరోగ్య శాఖ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతూ ద‌శ‌ల వారీగా ట్రైన్ల‌ను న‌డ‌పాల‌ని రైల్వే శాఖ‌కు సూచించింది.

– రైళ్ల టైమింగ్స్, బుకింగ్స్ వివ‌రాలు, ప్యాసింజ‌ర్ల రాక‌పోక‌ల స‌మ‌యంలో పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను రైల్వే శాఖ స‌వివ‌రంగా ప్ర‌చురించాలి.

– ఆన్ లైన్ లో మాత్ర‌మే టికెట్ బుకింగ్.. క‌న్ఫామ్ టికెట్ ఉన్న వాళ్లకు మాత్ర‌మే రైలులో ప్ర‌యాణించేందుకు అనుమ‌తి.

– టికెట్ బుక్ అయిన ప్యాసింజ‌ర్ ను రైల్వే స్టేష‌న్ కు తీసుకువ‌చ్చేందుకు వెహిక‌ల్ డ్రైవ‌ర్ కు ఆ టికెట్ ఆధారంగా అనుమ‌తి. ఆ ప్ర‌యాణికుడు ఇంటికి చేరే స‌మ‌యంలోనూ అదే పాస్ లా ఉప‌యోగ‌ప‌డుతుంది.

– ప్ర‌తి ప్ర‌యాణికుడిని స్టేష‌న్ ఎంట్రీలోనే స్క్రీనింగ్ చేసి క‌రోనా ల‌క్ష‌ణాలేవీ లేకుంటేనే లోప‌లికి అనుమ‌తించాలని రైల్వే శాఖకు సూచించింది కేంద్ర హోం శాఖ‌. స్టేష‌న్ లోకి వ‌చ్చేట‌ప్పుడు, ప్యాసింజ‌ర్ దిగిన స్టేష‌న్ లోనూ హ్యాండ్ శానిటైజ‌ర్ ను అందుబాటులో ఉంచాలని చెప్పింది.

– ప్ర‌తి ప్ర‌యాణికుడు త‌ప్ప‌నిస‌రిగా ఫేస్ మాస్క్ ధ‌రించేలా చూడాలి. రైలు ఎక్కే స‌మ‌యంలో, ప్రయాణంలోనూ సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.

– హెల్త్ అడ్వైజ‌రీ, గైడ్ లైన్స్ ను ప్యాసింజ‌ర్లు, స్టాఫ్ కు అవ‌గాహ‌న క‌ల్పించాలి.

– ప్ర‌యాణికులు గ‌మ్యం చేరిన త‌ర్వాత ఆయా రాష్ట్రాలు సూచించిన హెల్త్ ప్రొటోకాల్ ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి.