ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం రోజురోజుకు ముదురుతోంది. రెండు నెలల క్రితం కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించిన నాటి నుంచి ఈ వివాదం మొదలైంది. 2022 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ముంబైని వీడిన పాండ్యా.. గుజరాత్ టైటాన్స్ జట్టు పగ్గాలు చేపట్టాడు. తొలిసారే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అనంతరం 2023లో రన్నరప్‌గా నిలిపాడు. ఆ తరువాత గుజరాత్ యాజమాన్యంతో విబేధాలు తెలెత్తడంతో టైటాన్స్‌ను వీడి ముంబైకు తిరిగొచ్చాడు.
ఈ క్రమంలో ముంబై యాజమాన్యం రోహిత్ శర్మపై వేటు వేసింది. గత రెండు సీజన్లలో జట్టును విజయపథంలో నడిపించకపోవడంతో అతన్ని తప్పించి పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇది రోహిత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇది పాత కథ. ఈ విషయంపై రెండ్రోజుల క్రితం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ మీడియాతో మాట్లాడారు. రోహిత్ శర్మపై ఒత్తిడి తగ్గించేందుకు ముంబై ఇండియన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బౌచర్ వెల్లడించాడు. అలా చేస్తే అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలదనేదే తమ ఉద్దేశ్యమని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే డైరెక్ట్‌గా స్పందించింది. బౌచర్ వ్యాఖ్యల్లో తప్పులు ఉన్నాయంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది.
Rohit Sharma wife Ritika Sajdeh's view on Mark Boucher's interview talking about Hardik Pandya taking over MI captaincy pic.twitter.com/OJV62gcCgo
— Rohit Fans Army™ (@MIFansArmy) February 6, 2024
ఆకాష్ చోప్రా
'బౌచర్ వ్యాఖ్యల్లో తప్పు ఉందంటూ..' రోహిత్ భార్య స్పందించడం పాండ్యాను ఒత్తిడిలోకి నెడుతుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. "ఏది ఒప్పో ఏది తప్పుదో మాకు తెలియదు. ముంబై ఇండియన్స్‌కు పేపర్‌పై అద్భుతమైన జట్టు. అయితే, ఇలాంటి వ్యాఖ్యలు హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి పెంచుతాయి. అదే జరిగితే అతడు జట్టును ఒక్కటి చేసినందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది.." అని వ్యాఖ్యానించారు. రితికా కామెంట్‌తో రాజుకున్న ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. రితిక స్పందించడం తప్పన్న విమర్శలూ వస్తున్నాయి.