
- సత్తాచాటిన అరంగేట్రం బౌలర్ అశ్వనీ కుమార్
- రాణించిన రికెల్టన్
ముంబై: అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (4/24) అద్భుత బౌలింగ్‌తో విజృంభించడంతో ఐపీఎల్18లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. వరుసగా రెండు ఓటముల అనంతరం సొంతగడ్డపై గెలుపు బాట పట్టింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. వన్‌సైడ్ పోరులో మొదట కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 రన్స్‌కే కుప్పకూలింది.
ఈ సీజన్‌లో ఇదే లోయెస్ట్ స్కోరు కావడం గమనార్హం. అంగ్‌క్రిష్ రఘువంశీ (16 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26), రమణ్‌దీప్ సింగ్ (12 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 22) టాప్ స్కోరర్లు. అనంతరం ముంబై 12.5 ఓవర్లలోనే 121/2 స్కోరు చేసి గెలిచింది. ర్యాన్ రికెల్టన్ (41 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62) ఫిఫ్టీ కొట్టగా.. సూర్యకుమార్ (9 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 నాటౌట్) ఆకట్టుకున్నాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా రికార్డు సృష్టించిన అశ్వనీ కుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అశ్వనీ అదరహో
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయానికి బౌలర్లు పూర్తి న్యాయం చేశారు. వాంఖడే పిచ్‌పై బౌన్స్, స్వింగ్‌ను సద్వినియోగం చేసుకొని ఆరంభం నుంచే పదునైన బంతులతో కేకేఆర్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. పేసర్ ట్రెంట్ బౌల్ట్ (1/23), దీపక్ చహర్ (2/19) పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు తీసి కోల్‌కతాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు.
బౌల్ట్ తొలి ఓవర్లోనే మంచి ఔట్ స్వింగర్‌తో ఓపెనర్ సునీల్ నరైన్ (0)ను బౌల్డ్ చేసి తొలి దెబ్బకొట్టాడు.ఆ తర్వాత చహర్ ఆఫ్ కటర్‌తో ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్ (1)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో కెప్టెన్ అజింక్యా రహానె (11) ఓ సిక్స్, ఫోర్‌తో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ, నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన 23 ఏండ్ల అశ్వనీ తన తొలి బాల్‌కే రహానెను ఔట్ చేసి కలల అరంగేట్రం చేశాడు. ఆ వెంటనే వెంకటేశ్ అయ్యర్ (3)ను చహర్ వెనక్కుపంపడంతో పవర్ ప్లేలో కేకేఆర్ 41/4తో కష్టాల్లో పడింది.
ఈ టైమ్‌లో యంగ్‌స్టర్ అంగ్‌క్రిష్ రఘువంశీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. మూడు ఫోర్లతో పాటు అశ్వనీ బౌలింగ్‌లో ఓ సిక్స్ కూడా కొట్టి ఆకట్టుకున్నాడు. కానీ, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1/10)వేసిన ఊరించే షార్ట్ బాల్‌కు తను నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే (19), రింకూ సింగ్ (17)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన అశ్వనీ.. డేంజర్ మ్యాన్ ఆండ్రీ రస్సెల్ (5)ను కూడా బౌల్డ్ చేసి కోల్‌కతాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. చివర్లో రమణ్‌దీప్ మెరుపులతో కేకేఆర్ స్కోరు వంద దాటింది. హర్షిత్ రాణా (4) విగ్నేశ్ పుతుర్, రమణ్‌దీప్‌ను శాంట్నర్ వెనక్కుపంపడంతో 17 ఓవర్లలోనే నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
రికెల్టన్ ఫటాఫట్
చిన్న టార్గెట్‌ను ముంబై ఇండియన్స్ ఈజీగా ఛేజ్ చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఓపెనర్ రోహిత్ శర్మ (13) మరోసారి తడబడినా ఇంకో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో 4, 6తో వేగం పెంచిన అతను హర్షిత్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. క్రీజులో ఇబ్బంది పడిన రోహిత్‌ను ఆరో ఓవర్లో రసెల్ ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 46 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది.
వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ (16 )ఎదుర్కొన్న రెండో బాల్‌కే సిక్స్ కొట్టి తర్వాత నెమ్మదించాడు. మరోవైపు భారీ షాట్లతో తన ఊపు కొనసాగించిన రికెల్టన్.. నరైన్ బౌలింగ్‌లో సిక్స్‌తో లీగ్‌లో తొలి ఫిఫ్టీ (33 బాల్స్‌లో) సాధించాడు. రస్సెల్ బౌలింగ్‌లో జాక్స్ ఔటవగా.. సూర్యకుమార్ మెరుపు షాట్లతో అలరించాడు. రస్సెల్ వేసిన 13వ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో మరో 43 బాల్స్ మిగిలుండగానే ముంబైని గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 16.2 ఓవర్లలో 116 ఆలౌట్
(రఘువంశీ 26, రమణ్‌దీప్ 22, అశ్వనీ 4/24).
ముంబై: 12.5 ఓవర్లలో 121/2 (రికెల్టన్ 62,
సూర్య కుమార్ 27*, రస్సెల్ 2/35)