ఏ ముహూర్తాన హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేపట్టాడో కానీ వారికి ఏదీ కలిసి రావడం లేదు. జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లకు కొరత లేకున్నా.. ఏ ఒక్కరూ రాణించడం లేదు. దీనికి తోడు సొంతగడ్డపైనా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 10 మ్యాచులు ఆడిన ముంబై.. మూడింట విజయం సాధించింది. లీగ్ దశలో వీరింకా 4 మ్యాచ్‌లు ఆడాల్సివుండగా.. అన్నింటా విజయం సాధించినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. వీటన్నింటికి తోడు సొంతగడ్డపై ఓడి.. పూర్వ వైభవాన్ని కోల్పోతున్నారు.
శుక్రవారం(మే 03) వాంఖడేలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ల ప్రదర్శన అందరినీ నిరాశ పరిచింది. కోల్‌కతా నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప ఛేదనలో ముంబై18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో కోల్‌కతా 12 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది.
4371 రోజుల తరువాత విజయం
కోల్‌కతా నైట్ రైడర్స్ చివరిసారి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై మే 16, 2012న విజయం సాధించింది. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో తొలి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఈ ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా 11 మ్యాచ్‌లు జరగ్గా.. అన్నింటా ముంబైయే గెలుపొందింది. ఆ కరువును కోల్‌కతా ఆటగాళ్లు శుక్రవారం ముగించారు. 12 ఏళ్ల తరువాత ముంబైని వారి సొంతగడ్డపై ఓడించి చరిత్ర సృష్టించారు.
12 years, we're finally here! 💜
— KolkataKnightRiders (@KKRiders) May 3, 2024
This one is for you, #KnightsArmy! pic.twitter.com/VUsIPddlMo
ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం!
ముంబైపై విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 10 మ్యాచులు ఆడిన కోల్‌కతా.. 7 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. లీగ్ దశలో వీరింకా 4 మ్యాచ్‌లు ఆడాల్సివుండగా..రెండింట గెలిచినా(18 పాయింట్లు) టాప్-2లో నిలవచ్చు.