MI vs KKR: కోల్‌కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై

 MI vs KKR: కోల్‌కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై

ఐపీఎల్ 17వ సీజన్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ అవతరించింది. శుక్రవారం(మే 03)  వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత  కోల్‌కతా 169 పరుగులు చేయగా.. చేధనలో ముంబై బ్యాటర్లు 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలారు. ఈ సీజన్‌లో హార్దిక్ సేనకిది 8వ ఓటమి.  

బౌలింగ్‌లో చెలరేగిన ముంబై.. బ్యాటింగ్‌లో తడబడింది. 170 పరుగుల ఛేదనలో ముంబై బ్యాటర్లు మందకొడిగా బ్యాటింగ్ చేశారు. కోల్‌కతా బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేక పరుగులు చేయడంతో వెంకడిపోయారు. అదే వారిని దెబ్బతీసింది. 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబైని సూర్య(56; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లు) ఆదుకున్నాడు. వైభవ్ అరోరా వేసిన 14వ ఓవర్‌లో ఏకంగా 4, 6, 4, 4 బాది 20 పరుగులు రాబట్టాడు. అప్పటివరకూ మ్యాచ్ ముంబై చేతుల్లోనే ఉంది. 

ఆ సమయంలో రస్సెల్.. సూర్యను ఔట్ చేసి మ్యాచ్ మలుపుతిప్పాడు. ఫుల్ టాస్ బంతి ఎడ్జ్ తీసుకోవడంతో కీపర్‌ సాల్ట్.. సూర్య మెరుపులకు తెరదించాడు. అనంతరం టిమ్ డేవిడ్(24) కాసేపు పోరాడిన ముంబైకి ఓటమి తప్పలేదు. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

ఆదుకున్న అయ్యర్, పాండే

అంతుకుముందు కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 57 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ను వెంకటేష్ అయ్యర్(70), మనీష్ పాండే(42) గట్టెక్కించారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 83 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, తుషార మూడేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసుకున్నాడు.