
లక్నో: ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కో విజయంతోనే ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. రెండో విజయంతో లీగ్‌లో ముందడుగు వేయాలని ఇరుజట్లు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇద్దరు ప్రధాన ప్లేయర్లైన రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌కు ఈ మ్యాచ్ పెద్ద సవాల్‌గా మారింది. గత మూడు మ్యాచ్‌ల్లో ఫెయిలైన ఈ ఇద్దరిపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది.
కాబట్టి ఈ మ్యాచ్‌తోనైనా గాడిలో పడాలని ఫ్యాన్స్ విపరీతంగా ఆశలు పెట్టుకున్నారు. ముంబైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ ఫామ్ ముంబై యాజమాన్యాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ హిట్‌మ్యాన్ ఫెయిలైతే జట్టులో చోటే కష్టంగా మారుతుంది. ఎల్‌ఎస్‌జీ కెప్టెన్‌గా ఉన్న పంత్ విషయంలోనూ ఫ్రాంచైజీ తీవ్ర అసంతృప్తితో ఉంది.
వీరిద్దర్ని కాసేపు పక్కనబెడితే హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టులో వనరులకు ఏమాత్రం కొదవలేదు. కానీ పరిస్థితులకు తగినట్లుగా ఆడటంలో టీమ్ సమష్టిగా విఫలమవుతోంది. స్టార్ పేసర్ బుమ్రా ఎప్పుడు తిరిగి వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. దీంతో బౌలింగ్ మరింత బలహీనంగా మారింది. అయితే కోల్‌కతాపై రాణించిన అశ్విని కుమార్ మరోసారి చెలరేగితే ముంబై బౌలింగ్ కష్టాలు కొంతవరకైనా తీరుతాయి. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ నుంచి మరింత సహకారం అవసరం. విఘ్నేశ్ పుతూర్‌పై కూడా భారీ ఆశలు ఉన్నాయి.
బ్యాటింగ్‌లో రోహిత్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. మరోవైపు లక్నో కూడా గాడిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా తృటిలో విజయాలు చేజారుతుండటంతో అటు ప్లేయర్లు, ఇటు ఫ్రాంచైజీ నిరాశ చెందుతోంది. నికోలస్ పూరన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా మిగతా వారి నుంచి సరైన సహకారం దక్కడం లేదు. మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ చెలరేగితే ముంబైకి కష్టాలు తప్పవు.