MI vs LSG: పూరన్‌ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు

MI vs LSG: పూరన్‌ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు

వాంఖడే వేదికగా ముంబైతో జరుగుతున్న నామమాత్రపు పోరులో లక్నో స్టార్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. కేఎల్ రాహుల్(55: 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్ పూరన్(75; 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), అర్ధ శతకాలతో చెలరేగారు. దీంతో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను లంక పేసర్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. నువాన్ తుషార వేసిన మొద‌టి ఓవ‌ర్లో దేవదత్  ప‌డిక్కల్(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ త‌ర్వాత పీయూష్ చావ్లా విజృంభ‌ణ‌తో మార్కస్ స్టోయినిస్(28), దీప‌క్ హుడా(11)లు వెంటవెంటనే పెవిలియ‌న్ చేరారు. దీంతో ల‌క్నో 69 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో  కేఎల్ రాహుల్(29), నికోలస్ పూర‌న్(7) జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.

మొదట నెమ్మదిగా ఆడిన వీరిద్దరూ.. క్రీజులో కుదురుకున్నాక ముంబై బౌలర్లను చితక్కొట్టారు. తొలి పది ఓవర్లలో లక్నో స్కోర్ 69 పరుగులు కాగా.. చివరి పది ఓవర్లలో ఏకంగా 139 పరుగులు రాబట్టారు. అంతలా వీరి విధ్వంసం సాగింది. కట్టడి చేయడానికి బుమ్రా కూడా లేకపోవడంతో వారిని కాపాడే కరువయ్యాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ని గాయం ఇబ్బంది పెట్టడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. చివరలో ఆయుష్ బదోని(22నాటౌట్; 10 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లు), క్రునాల్ పాండ్యా(12 నాటౌట్; 7 బంతుల్లో  ఒక ఫోర్,  ఒక సిక్స్‌) విలువైన పరుగులు చేశారు.

ముంబై బౌలర్లలో నువాన్ తుషార(3 వికెట్లు), పీయూష్ చావ్లా(3 వికెట్లు) మినహా అందరూ విఫలమయ్యారు.