సాధారణంగా అసోసియేట్ జట్లన్నా.. ఆ జట్లకు చెందిన ఆటగాళ్లన్నా మేటి జట్లకు ఎప్పుడూ చిన్నచూపే. కానీ, ప్రస్తుతం రోజులు మారాయి. చిన్న చిన్న జట్లే తమదైన రోజు అగ్రశ్రేణి జట్లకు ఊహించని షాకులిస్తున్నాయి. ఇటీవల రెండు సార్లు పపంచ ఛాంపియన్ వెస్టిండీస్ ఓటములే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసోసియేట్ జట్లను తేలిగ్గా అంచనా వేసిన విండీస్ వీరులు.. ఊహించని పలితాలతో వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచే నిష్క్రమించారు.
ఇప్పుడిప్పుడే అసోసియేట్ జట్ల ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మేటి జట్ల ఆటగాళ్లతో పోటీపడుతున్నారు. తాజాగా అమెరికన్ క్రికెటర్, ముంబై న్యూయర్క్ ఓపెనర్ షాయన్ జహంగీర్ కొట్టిన భారీ సిక్సర్ అంతర్జాతీయ క్రికెటర్లనే ఆశ్చర్యపరిచింది. ఏకంగా 151 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతిని జహంగీర్.. అంతే వేగంతో స్టాంలోకి పంపారు.
104 మీటర్ల భారీ సిక్స్
మేజర్ లీగ్ టోర్నీలో భాగంగా శనివారం టెక్సస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఛాలెంజర్ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ కింగ్స్ 158 పరుగులు చేయగా.. ముంబై ఆ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టెక్సాస్ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ 151 కి.మీ వేగంతో సంధించిన బంతిని.. జహంగీర్ 104 మీటర్ల భారీ సిక్స్‌గా మలిచారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
151 KMPH SENT PAST THE STANDS!
— Major League Cricket (@MLCricket) July 29, 2023
Shayan Jahangir hits a 104 METER SIX on Gerald Coetzee!
3⃣3⃣/1⃣ (4.5) pic.twitter.com/KscFvBcXXS
కాగా షాయన్ జహంగీర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లోనూ అతను మెరుగైన ప్రదర్శన కనబరిచారు. నేపాల్‌తో జరిగిన క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో 79 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకొని తన తొలి అంతర్జాతీయ శతకాన్ని అందుకున్నారు.
ఇక ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో సీటెల్ ఓర్కాస్, ముంబై న్యూయార్క్ జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి.